కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-18T10:20:14+05:30 IST

కరోనా సమయంలోలాగే, వరదల కష్టకాలంలోనూ ప్రజలకు అండగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు.

కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలి

జీహెచ్‌ఎంసీలో నీటి నమూనాల పరీక్ష: ఈటల 


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలోలాగే, వరదల కష్టకాలంలోనూ ప్రజలకు అండగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వర్షాలు, వరదల వల్ల కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలే అవకాశముందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య  వైద్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో కలిసి శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, జ్వరం ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు మందులు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.


పునరావాస కేంద్రంలో ఉన్న వారికి ఇప్పటి వరకు 16 వేల మందికి పరీక్షలు నిర్వహించి, మందులు అందించామని చెప్పారు. అన్ని ప్రాంతాల నుంచి మెట్రో వాటర్‌ బోర్డ్‌ సహకారంతో నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని, నీరు కలుషితం కాకుండా ఉండేలా క్లోరినేషన్‌ చేస్తున్నామని  వివరించారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 165 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, డాక్టర్లు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది 24 గంటలపాటు పని చేస్తున్నారని, వీటితో పాటు 46 మొబైల్‌ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-10-18T10:20:14+05:30 IST