పర్యావరణం,పచ్చదనం పెంపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

ABN , First Publish Date - 2022-04-17T00:11:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ ఉండాలనే సంకల్పంతోనే హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు జరిగిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

పర్యావరణం,పచ్చదనం పెంపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం, సామాజిక స్పృహ ఉండాలనే సంకల్పంతోనే హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు జరిగిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితనిధి పురోగతి, ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై అరణ్య భవన్ లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.మే నెల నుంచి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, విద్యార్థులు తమ వంతు విరాళం హరితనిధికి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 


ఇప్పటిదాకా సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై డిపార్ట్ మెంట్ వారీగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, మే నెల నుంచి హరితనిధికి నిధులు జమ అయ్యేలా చూడాలన్నారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలు తర్వాత తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపు రేఖలు మారుతున్నాయని, పచ్చదనం- పరిశుభ్రత అవసరాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితనిధి ద్వారా సమాజంలోని ప్రతీ ఒక్కరి భాగస్వామ్యంతో మరింత సమర్థవంతంగా పచ్చదనం కార్యక్రమాలను అమలు చేయటం సాధ్యం అవుతుందన్నారు. 


సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, రిజిస్టేషన్ల శాఖ ఐ.జీ. వి.శేషాద్రి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సీడీఎంఏ కమిషనర్ ఎన్.సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సయాద్ ఒమర్ జలీల్, ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అమ్మద్, పాఠశాల విద్యాశాఖ దేవసేన, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ఎం. ప్రశాంతి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్, ప్లానింగ్ శాఖ డైరెక్టర్ పీ.శ్రీరాములు, పంచాయితీ రాజ్, నీటి పారుదల శాఖలతో పాటు, ఇతర సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

Updated Date - 2022-04-17T00:11:13+05:30 IST