శఠగోపం, తీర్థప్రసాదాలు ఉండవు: ఇంద్రకరణ్‌

ABN , First Publish Date - 2020-06-06T08:40:36+05:30 IST

దేవాలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని 78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు.

శఠగోపం, తీర్థప్రసాదాలు ఉండవు: ఇంద్రకరణ్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): దేవాలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని 78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నారు. ఆంక్షల నడుమ భక్తుల్ని దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ  నేపథ్యంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ఆ శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 8 నుంచి ఆలయాల తలుపులు తెరవనున్నామని మంత్రి తెలిపారు. ఆలయాల్లోకి వచ్చే భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించడం తప్పనిసరి అని అన్నారు. అయితే పుష్కరిణిలో స్నానాలకు అనుమతి లేదని, అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ, వసతి సౌకర్యాలు ఉండవని అన్నారు.


ఆలయాల వద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు పొందవచ్చని తెలిపారు. క్రంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్న ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి లేదని, ఆయా జోన్ల నుంచి భక్తులు దర్శనానికి కూడా రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్ల పైబడినవారు, 10 ఏళ్లలోపు పిల్లలు, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆలయాలకు రావద్దన్నారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌  చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సూచించారు.

Updated Date - 2020-06-06T08:40:36+05:30 IST