న్యాయ వ్యవస్థ బలోపేతానికి చేయూత: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-30T23:41:09+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోనివిజ్ఞాన్ భ‌వ‌న్ లో శనివారం జరిగిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తులు, రాష్ట్ర ముఖ్య‌ మంత్రుల స‌ద‌స్సులో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు.

న్యాయ వ్యవస్థ బలోపేతానికి చేయూత: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోనివిజ్ఞాన్ భ‌వ‌న్ లో శనివారం జరిగిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తులు, రాష్ట్ర ముఖ్య‌ మంత్రుల స‌ద‌స్సులో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు  న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను 24 నుంచి 42 కు పెంచేందుకు కృషి చేసిన సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ, కేంద్ర న్యాయ శాఖ‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ త‌ర‌పున మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. రాష్ట్ర హైకోర్టులో గ‌తంలో 12 మంది న్యాయ‌మూర్తుల ఉండ‌గా కొత్త‌గా 17 మంది  న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించి సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ కేసుల స‌త్వ‌ర ప‌రిష్కారానికి  మార్గం చూపారని కొనియాడారు. 


ప్ర‌స్తుతం 29 మంది న్యాయ‌మూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వ‌హిస్తున్నారంటే ఆయ‌న ప్ర‌త్యేక కృషి ఫ‌లిత‌మేనని  చెప్పారు.రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తి స‌హాయ‌సాకారాలు అందిస్తుంద‌ని తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో  పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్ డేట్ కావడం, తదితర మౌలిక వసతులను మెరుగుపరచడం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అవ‌స‌ర‌మైన  చర్యలను ప్ర‌భుత్వం  తీసుకుంటుంద‌న్నారు. 


హైకోర్టు ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు  త‌క్ష‌ణ‌మే నిధులు స‌మ‌కూరుస్తున్నామ‌ని చెప్పారు.అంత‌ర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేష‌న్  సెంటర్‌ ఏర్పాటు చేయ‌డానికి సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ క్రియ‌ాశీల‌ చొర‌వ తీసుకున్నార‌న్నారు.  హైద‌రాబాద్ లో ఐఏఎంసీ నెల‌కొల్పేందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, స్థలం, నిధులను తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించింద‌ని వెల్ల‌డించారు. ఐఏఎంసీ ఏర్పాటుతో ప్రముఖ‌ సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిష్క‌రించ‌డానికి అస్కారం ఏర్ప‌డింద‌ని చెప్పారు.న్యాయ వ్య‌వ‌స్థ‌లో మౌలిక వ‌స‌తుల‌ను పెంపొందించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Updated Date - 2022-04-30T23:41:09+05:30 IST