రెండు, మూడు నెలలు కరోనా విస్తరణపై అప్రమత్తంగా ఉండాలి: ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-04-16T22:28:06+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.

రెండు, మూడు నెలలు కరోనా విస్తరణపై అప్రమత్తంగా ఉండాలి: ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు  ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్ 19 కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అరణ్య భవన్ లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ ఉద్యోగులు ఈ వైరస్ భారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇప్పటి వరకు ఎంత మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు?, ఎంతమందికి కరోనా వైరస్ సోకింది?, కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది అటవీ ఉద్యోగులు మరణించారు? అని మంత్రి ఆరా తీశారు. అటవీ శాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పీసీసీఎస్) ఆర్. శోభను ఆదేశించారు. 


ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అందరికీ వాక్సిన్ ఇచ్చేలా జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.కోవిడ్ భారిన పడిన అటవీ ఉద్యోగులు సాధకబాధకాలను తెలుసుకోవడం, అటవీ ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్, తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించాలని పీసీసీఎఫ్ కు మంత్రి సూచించారు. గత యేడాది నుంచి అటవీ శాఖలో  236 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారని, ఇప్పటి వరకు 11 మంది మరణించారని పీసీసీఎఫ్ తెలిపారు. అటవీ ఉద్యోగులు, సిబ్బంది మరణాలపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. వైద్యం, ఆరోగ్య పరంగా  ఎలాంటి సమస్య ఉన్నా అరణ్య భవన్ కు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని మంత్రి అన్నారు.


 ఆ తర్వాత అన్ని జిల్లాల అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కరోనా పట్ల అప్రమత్తత అవసరాన్ని వివరించారు. తప్పని సరిగా మాస్క్, భౌతిక దూరం పాటించటం, పరిసరాల శుభ్రతను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఉద్యోగులను కోరారు. 45 ఏళ్లు నిండిన ప్రతీ ఉద్యోగి వెంటనే వాక్సినేషన్ ప్రక్రియను ముగించాలని, ఆయా జిల్లాల్లో వైద్య శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-04-16T22:28:06+05:30 IST