విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్దిపేట..

ABN , First Publish Date - 2020-07-09T12:35:02+05:30 IST

యాసంగిలో సంప్రదాయ పంటల స్థానంలో 50 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేపట్టి జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని ..

విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్దిపేట..

వానాకాలం పంట కోతలలోపు రైతువేదికలు పూర్తవ్వాలి

ప్రధాన అంశంగా వీటిని పరిగణించాలి

వారంలో కొవిడ్‌-19 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి 

సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, జూలై 8: యాసంగిలో సంప్రదాయ పంటల స్థానంలో 50 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేపట్టి జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతువేదికల నిర్మాణంపై దృష్టిసారించి త్వరగా వాటిని పూర్తిచేయాలన్నారు. సిద్దిపేటలోని కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, జడ్పీచైర్మన్‌ రోజాశర్మతో కలి సి జిల్లాలో రైతువేదిక పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతువేదికల నిర్మాణాన్ని అత్యంత ప్రధాన అంశంగా భావించి రైతుబంధు అధ్యక్షుడు, వ్యవసాయ అధికారులు వాటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ వానాకాలం పంట కోతకు రాకముందే రైతువేదికల నిర్మాణం వందశాతం పూర్తవ్వాలన్నారు. యాసంగి పంట సన్నద్ధత, శిక్షణా కార్యక్రమాలు రైతువేదికల్లో నిర్వహించేలా చూడాలని చెప్పారు. జిల్లాలో చేపట్టనున్న 160 రైతువేదికల నిర్మాణ పనులు 2 రోజుల్లో ప్రారంభం కావాలని పేర్కొన్నారు.


జిల్లాలో 21చోట్ల భూసంబంధిత సమస్యలతో నిర్మాణానికి ప్రతిబంధం అధికారులు నివేదికలో తెలియజేశారని వెంటనే ఆ గ్రామాలను రెవెన్యూ డివిజనల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్మాణానికి అనువుగా స్థలాలను గుర్తించాలన్నారు. అవసరమైన ఇసు క, సిమెంట్‌ను రెండురోజుల్లో సరఫరా చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మాట్లాడారు. ఆగస్టులో అన్ని రైతువేదికల నిర్మాణం పూర్తిచేసేలా కార్యచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక్కో రైతువేదిక వద్ద 20 మంది పనివాళ్లు ఉండేలా చూడాలన్నారు.  


కొవిడ్‌-19 పరీక్షా కేంద్రం సిద్ధం చేయాలి

సిద్దిపేటకు కొవిడ్‌-19 పరీక్షా కేంద్రాన్ని తెప్పించేలా కావాల్సిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రాణి, డీఎంఈ చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వారంలోపు సిద్దిపేట ప్రభుత్వమెడికిల్‌ కళాశాల ఆసుపత్రిలో కొవిడ్‌-19 పరీక్షా కేంద్రం అందుబాటులోకి తేవాలని జిల్లావైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారిగా జడ్పీసీఈవో శ్రవణ్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌-19 శిక్షణకు జిల్లా నుంచి 18మంది వైద్య సిబ్బంది హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యాధికారులకు సూచించారు. సమీక్షలో  అడిషనల్‌ జిల్లా కలెక్టర్లు పద్మాకర్‌, ముజామిల్‌ఖాన్‌, డీఏవో శ్రవణ్‌, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, డీపీఓ సురే్‌షబాబు, జడ్పీసీఈవో శ్రవణ్‌, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ కనకరత్నం, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ తమిళఅరసు, డీఎంహెచ్‌వో మనోహర్‌, వైద్యసిబ్బంది, వైద్య ప్రొఫెసర్లతోపాటు ఇతర ఇంజనీరింగ్‌శాఖ అధికారులు డీఈ వేణు, జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ‘సుడా’ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 


మిట్టపల్లి బ్రాండ్‌ పప్పులు..

సిద్దిపేట మహిళలు అన్నింటా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట మోడల్‌ రైతుబజారులో మిట్టపల్లి గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే పప్పు విక్రయ స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. మిట్టపల్లి గ్రామమహిళలు మంత్రికి పప్పు దినుసుల ప్యాకెట్లు అందజేశారు.. మిట్టపల్లి మహిళలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని పప్పును తయారు చేసే యంత్రాలను కొనుగోలు చేశారని ఈ ప్రయత్నం వారికి మంచి చేయాలన్నారు. సీజన్‌ వారీగా రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధరకు సరకులు కొనుగోలు చేసి పప్పు దినుసులు తయారు చేస్తున్నారని, రూ.500కు 6కిలోల పప్పును ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్‌ పాల సాయిరాం పాల్గొన్నారు.


దేశానికే ఆదర్శం ఐకేపీ మహిళలు

సిద్దిపేట జిల్లాలో మహిళలు అనుకుంటే ఏదైనా సాధించే సత్తా ఉందని, ఇవాళ ఐకేపీ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి అన్నారు. వానాకాలం 2018-19లో పండించిన వరిధాన్యం కొనుగోలుపై జిల్లాలోని గ్రామైక్య సంఘాలకు, ప్యాక్స్‌లకు, గ్రామైక్య సంఘాల ద్వారా 95 కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి రూ.2.30కోట్లు కమీషన్‌ సేవా రుసుం చెల్లింపు చెక్కులను మంత్రి హరీశ్‌రావు బుధవారం సిద్దిపేటలోని కలెక్టరేట్‌ ఆవరణలో మహిళా సంఘాలకు పంపిణీ చేశారు.  ఈ ఏడాది కూడా శనిగరం, కూరేళ్ల గ్రామాలు ధాన్యం కొనుగోళ్లలో ప్రథమ స్థానంలో నిలిచాయన్నారు.  కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, ‘సుడా’ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి,  డీఆర్డీఏ అధికారిక సిబ్బంది పలువరు పాల్గొన్నారు.


పందిరిసాగుకు ఆర్థికసాయం

 జిల్లాలోని రైతులకు పందిరిసాగుకు, ఆకుకూరల సాగుకు నాబార్డు జాతీయ వ్యవసాయగ్రామీణాభివృద్ధి బ్యాంకు ద్వారా ఆర్థికసహాయం అందివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి నివాసంలో రైతులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మల్టీ లేయర్‌ వెజిటేబుల్స్‌ కల్టివేషన్‌ ఫర్‌ డబ్లిండ్‌ ఇన్‌కమ్‌పై అవగాహన శిక్షణ తరగతులను నిర్వహిస్తూ ఇన్‌పుట్‌ సపోర్టు కింద ఒక్కొక్కరికి రూ.70 వేలు అందివ్వనున్నట్లు తెలిపారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదవారికి అండగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని 8వ వార్డు(నర్సాపురం)లో ఇటివల మరణించిన రాజయ్య భార్య భూదవ్వకు రైతుభీమా పథకం ప్రొసీడింగ్‌ కాపీని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో 8వవార్డు కౌన్సిలర్‌ నర్సింలు,  రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు  పర్శరాములు యాదవ్‌, పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T12:35:02+05:30 IST