ఈ నెలాఖరు టార్గెట్‌

ABN , First Publish Date - 2020-07-08T11:45:07+05:30 IST

ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేసి....

ఈ నెలాఖరు టార్గెట్‌

స్వచ్ఛ సిద్దిపేట దిశగా అడుగులు వేద్దాం.. ఆదర్శంగా నిలుద్దాం

వైకుంఠధామాలు, డంప్‌యార్డుల నిర్మాణాలు వేగంగా పూర్తవ్వాలి

టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు 


సిద్దిపేట సిటీ, జూలై7: ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో డంప్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేసి.. సిద్దిపేటను ఆదర్శంగా నిలపాలని మంత్రి హరీశ్‌రావు ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి నారాయణరావుపేట, సిద్దిపేటఅర్బన్‌ మండలాల్లో అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులతో, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛగ్రామాలుగా తయారు చేయాలన్నారు. 15లోగా నారాయణరావుపేట మండలంలోని 10 గ్రామాల్లో డంప్‌ యార్డు ల నిర్మాణం పూర్తి చేసి, వర్మీ కంపోస్టును తయారు చేయాలని సూచించారు. సిద్దిపేటఅర్బన్‌ మండలంలో 12 గ్రామాలకు 9 గ్రామాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయని, 3 గ్రామాల్లో వేగవంతంగా పనులు చేపట్టాలన్నారు. మందపల్లి, బక్రీ చెప్యాల, తడకపల్లి, వెల్కటూర్‌ గ్రామాల్లో డంప్‌ యార్డ్‌, వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తయ్యేలా ఎంపీడీవో, ఎంపీవో బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. 


చెత్త సేకరణపై చైతన్యం తేవాలి

తడి, పొడిచెత్త సేకరణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా అంగన్‌వాడీ టీచర్స్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్స్‌, పంచాయతీ సెక్రటరీలు, ఐకేపీ మహిళలు భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. మహిళల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. 


ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి

అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతలను నిర్మించడంతో పాటు స్కూళ్లు, అంగన్‌వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌ వద్ద ఇంకుడు గుంతలను నిర్మించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. పైపులైన్‌ లీకేజీలు, గేట్‌వాల్వ్‌ల లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.


సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్స్‌కు మంత్రి సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. రక్తహీనత కలిగిన గర్భిణులను, బాలింతలను, కిశోర బాలికలను గుర్తించి వారికి అవసరమైన మందులను ఇవ్వాలని, పౌష్ఠికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. 


పల్లెల్లో ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలి

హరితహారంలో భాగంగా ప్రతీ గ్రామంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసే దిశగా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అందుకు అవసరమైన స్థలసేకరణ చేయాలన్నారు. వాటి నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.3లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ పండ్లు, పూల మొక్కలను ఇవ్వాలని సూచించారు. ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో చేపలచెరువుల నిర్మాణాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. ఎన్సాన్‌పల్లిలో చేపల చెరువుల నిర్మాణం పూర్తి చేసిన ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. 


సిద్దిపేటలో మన పప్పులు

 మంత్రి హరీశ్‌రావు చొరవతో మిట్టపల్లిలో మహిళా సంఘాల సభ్యులు సిద్దిపేట బ్రాండ్‌తో పప్పులను తయారు చేస్తున్నారు.  6 కిలోల పప్పును రూ.500 కు మార్కెట్‌లో అమ్ముతారు. సిద్దిపేట రైతుబజార్‌లో ప్రత్యేక స్టాల్స్‌ను మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించనున్నారు. 

Updated Date - 2020-07-08T11:45:07+05:30 IST