సీఎం లక్ష్యం..హరిత తెలంగాణ

ABN , First Publish Date - 2020-07-09T12:35:55+05:30 IST

రాష్ర్టాన్ని హరితతెలంగాణగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, అందుకు మనమంతా హరితహారంలో భాగస్వామ్యం..

సీఎం లక్ష్యం..హరిత తెలంగాణ

 ప్రభుత్వ చర్యలతో రైతు కళ్లల్లో ఆనందం, కాంగ్రెస్‌ నాయకుల కళ్లల్లో కన్నీళ్లు : హరీశ్‌రావు


 కొండపాక, జూన్‌ 8: రాష్ర్టాన్ని హరితతెలంగాణగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, అందుకు మనమంతా హరితహారంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరుహరీశ్‌రావు సూచించారు. కొండపాక మండలం కుకునూరుపల్లిలో బుధవారం మంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి ఆరోవిడత హరితహారంలో భాగంగా రాజీవ్‌రహదారి డివైడర్‌, రోడ్డుకు ఇరువైపులా 1200మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి  వారు మొక్కలను నాటారు. అనంతరం డీసీసీబీ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారన్నారు. డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు, మహిళలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. ప్రతిగ్రామంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలికే విధంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో ‘విలేజ్‌ పార్కు’లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 


ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రైతుబంధు జమ

 కరోనా వ్యాప్తితో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా కూడా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రంలోని 54లక్షల మంది రైతులకు రూ.14,500 కోట్లను రైతుబంధు రూపంలో వారి వారి ఖాతాల్లో జమ చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం వేతనాలను నిలిపినా, రైతులకు మాత్రం సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపలేదని గుర్తుచేశారు. కేసీఆర్‌ ముందుచూపుతో  రైతాంగానికి ఎరువుల కొరత లేదన్నారు.


గోదావరి నీళ్లతో జలకళ

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కడ చూసినా గోదావరి నీళ్లతో జలకళ సంతరించుకుందని ఎండాకాలంలోనూ 2వేల పైచిలుకు చెరువులు, కుంటలు గోదావరి నీళ్లతో నిండుకుండలా మారాయన్నారు. నీళ్లను చూసిన రైతుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తే, కాంగ్రెస్‌ నాయకుల కళ్లలో కన్నీళ్లు నిండాయని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో కూర్చుని విమర్శలు చేయడం సరికాదన్నారు. కుకునూరుపల్లి గ్రామాభివృద్ధికి మహిళా సమాఖ్య భవనం, అంగన్‌వాడీ కేంద్రం, పెద్దమ్మ ఆలయ ప్రహారీ, షాపింగ్‌కాంప్లెక్స్‌, డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు హామీనిచ్చారు. కుకునూరుపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, సర్పంచు పొల్కంపల్లి జయంతి విజ్ఞప్తి మేరకు విషయాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు హామీనిచ్చారు.


కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవి రవీందర్‌, జడ్పీటీసీ అనంతుల అశ్విని, ఎంపీపీ ర్యాగుల సుగుణ, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, పీఎన్‌ఆర్‌ ట్రస్టు అధినేత పొల్కంపల్లి నరేందర్‌, సర్పంచులు పోల్కంపల్లి జయంతి, చిట్టిమాధురి, కోల శ్రీనివాస్‌, మిట్టపల్లి వసంత, మహాదేవ్‌, రైతుబంధు మండల కన్వీనర్‌  దుర్గయ్య, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమర్‌, నాయకులు కోలరవీందర్‌, మాజీ ఎంపీటీసీ సద్గుణ, బాలాగౌడ్‌, ఎంపీడీవో రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T12:35:55+05:30 IST