ధాన్యం కొనుగోలుపై మంత్రి హరీష్‌రావు సమీక్ష

ABN , First Publish Date - 2022-04-18T18:34:53+05:30 IST

యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోలుపై మంత్రి హరీష్‌రావు సమీక్ష

సంగారెడ్డి: యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరు నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు. గతంలో పారాబాయిల్ద్ రైస్ మిల్లుల ఏర్పాటుకు రాయితీలు ఇచ్చి... ఇప్పుడు నట్టేట ముంచిందని మండిపడ్డారు. మూడు వేల కోట్ల నష్టాన్ని భరించి యాసంగిలో ధాన్యం కొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయన్నారు. ధాన్యం కొనుగోలులో రవాణా, ఇతరత్రా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4,700 కోట్లు ఖర్చు పెట్టిందని మంత్రి తెలిపారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రం తెలంగాణను ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసిందన్నారు. ఏడాదిలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోందని తెలిపారు. వచ్చే వానకాలంలో పత్తి, సోయా సాగు పెంచాలని... వాటికి మార్కెట్ లో మంచి ధర ఉందన్నారు. బీజేపీ హయాంలో రైతు ఆదాయం రెట్టింపు కాలేదని... ధరలు పెంచి పెట్టుబడి మాత్రం రెట్టింపు చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సమీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-18T18:34:53+05:30 IST