ఆగష్టు 16 నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం

ABN , First Publish Date - 2021-08-07T00:16:06+05:30 IST

ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాలను జమ చేయనున్నట్టు ఆర్ధిక శాఖమంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

ఆగష్టు 16  నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం

హైదరాబాద్: ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాలను జమ చేయనున్నట్టు ఆర్ధిక శాఖమంత్రి హరీశ్ రావు వెల్లడించారు.ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి 2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు.50  వేల లోపు రుణాలన్నీ మాఫీచేయనున్నట్టు తెలిపారు. బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దని అన్నారు. పూర్తిగా రుణాల మాఫీ ఖాతాలోనే జమ చేయాలని ఆదేశించారు. రుణ మాఫీ జరిగిన రైతుల అక్కౌంట్లు జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్కే భవన్ లో జరిగిన సమావేశంలో 42 బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 50  వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేర ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.ఆగష్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా 50 వేల‌లోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారని తెలిపారు.బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు‌ సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలని కోరారు.ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే ముఖ్య మంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధి దారుల ఫోన్లకు ఎస్.‌ఎం.ఎస్ వెళ్లాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 


రైతు రుణ మాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ‌ సందేశంలో  తప్పకుండా పేర్కొనాలన్నారు. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణ మాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద‌ జమ. చేయవద్దు. రైతుల కు ఇబ్బందులు‌ సృష్టించవద్దని‌ బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-07T00:16:06+05:30 IST