ఎన్నికల ప్రచారంలో హరీష్ నోట.. చంద్రబాబు మాట!

ABN , First Publish Date - 2020-10-18T23:29:18+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా సరే మళ్లీ గులాబీ జెండానే ఎగరేయాలని టీఆర్ఎస్ ప్రచారజోరు పెంచింది.

ఎన్నికల ప్రచారంలో హరీష్ నోట.. చంద్రబాబు మాట!

సిద్దిపేట జిల్లా : దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా సరే మళ్లీ గులాబీ జెండానే ఎగరేయాలని టీఆర్ఎస్ ప్రచారజోరు పెంచింది. ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న మంత్రి హరీష్ రావు భారీ మెజార్టీతో అభ్యర్థిని గెలిపించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు తెచ్చారు.


అసలేం జరిగిందంటే..

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అబద్ధపు ప్రచారాలన్ని రేపటి నుంచి ఎల్ఇడి స్ర్కిన్ పెట్టి ఊరూరు ప్రచారం చేపిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. వెనుకట చంద్రబాబు మీటర్లు పెడతానంటే జనమంతా ఆయనకు మీటర్లు పెట్టిండ్రు అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి కూడా అదేవిధంగా మీటర్లు పెడుతారని.. మీ పార్టీ కార్యకర్తలే మీరు ప్రవేశపెట్టే మీటర్ల బిల్లును వ్యతిరేకించారని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నారని హరీష్ విమర్శలు గుప్పించారు. దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదని.. ఆ పార్టీకి డిపాజిట్ దక్కదని మంత్రి జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు తెలంగాణలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వారికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ది చెప్పాలని నియోజకవర్గ ప్రజలకు హరీష్ సూచించారు.


దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీల సమక్షంలో హబ్సీపూర్, ధర్మాజీపేట గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పిన నేతలు.. టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



Updated Date - 2020-10-18T23:29:18+05:30 IST