దుబ్బాకలో ‘ప్రైవేట్‌’ వేగులు!

ABN , First Publish Date - 2020-10-18T09:59:23+05:30 IST

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, రాజకీయ ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

దుబ్బాకలో ‘ప్రైవేట్‌’ వేగులు!

నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ సీక్రెట్‌ టాస్క్‌... 20 మందితో నాలుగైదు బృందాలు

క్షేత్ర స్థాయి లోటుపాట్ల గుర్తింపు

రాత్రికి మంత్రి హరీశ్‌కు నివేదన

తెల్లవారి రంగంలోకి మంత్రి 


హైదరాబాద్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, రాజకీయ ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అక్కడ పార్టీ తరఫున ప్రచార సారథిగా వ్యవహరిస్తున్న మంత్రి హరీశ్‌రావు ఓ సీక్రెట్‌టాస్క్‌ చేపట్టారు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏ చిన్న లోపం వల్ల పార్టీ అభ్యర్థికి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఆయన ‘ప్రైవేట్‌’ వేగులను రంగంలోకి దించారు. ప్రభుత్వ నిఘావర్గాలకు వీరు అదనం. వచ్చే నెల 3న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ ఉండగా, టీఆర్‌ఎస్‌ తరఫున సోలిపేట సుజాతారామలింగారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, బీజేపీ తరఫున రఘునందన్‌రావు బరిలో ఉన్నా రు. అయితే సిటింగ్‌ స్థానాన్ని భారీ మెజారిటీతో నిలబెట్టుకోవటానికి టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తమ శ్రేణులను క్షేత్రస్థాయిలో మోహరించింది. నియోజకవర్గంలోని మండలానికి, గ్రామానికి,100 మంది ఓటర్లకు ఇన్‌చార్జిలను నియమించారు. 


భారీ మెజారిటీయే లక్ష్యంగా!

దుబ్బాకలో భారీ మెజారిటీ లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు సూక్ష్మస్థాయిలో కార్యాచరణను అమ లు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తనకు నమ్మకస్తులైన 20 మంది చాకుల్లాంటి కుర్రాళ్లను నాలుగైదు బృందాలుగా విభజించారు. ఈ బృందాలన్నీ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నాయి. ఒక్కో బృందం రోజూ ప్రతి మండలంలో ఐదారు గ్రామాలను రహస్యం గా చుట్టి వస్తోంది. బృంద సభ్యులు సాదాసీదాగా గ్రామాలకు వెళ్లి, జనం నుంచి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల కదలికలపైనా ఆరా తీస్తున్నారు. పగలంతా తిరిగే ఈ బృందాలు రాత్రికి గ్రామాల వారీగా హరీశ్‌రావుకు నివేదికను అందిస్తున్నాయి. వాటి ఆధారంగా హరీశ్‌ సమస్యలు తీర్చుతున్నారు. మాట్లాడాల్సిన వారితో మాట్లాడేస్తున్నారు. లేకపోతే స్థానిక పార్టీ ఇన్‌చార్జీలను పురమాయిస్తున్నారు. ఇలా ప్రత్యర్థి పార్టీల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే పావులు కదుపుతూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

అది సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ఓ మారుమూల గ్రామం. ఉదయం 6 గంటలు. లచ్చయ్య అనే 25 ఏళ్ల యువకుడికి ఫోన్‌ వచ్చింది. అటు వైపు నుంచి..‘‘తమ్మీ నేను హరీశ్‌రావును మాట్లాడుతున్నా’’ అని వినిపించింది. తర్వాత వారి మధ్య సాగిన సంభాషణ ఇది.


లచ్చయ్య: అన్నన్నా. నేను లచ్చయ్య మాట్లాడుతున్నా.

హరీశ్‌రావు: (నవ్వుతూ) తెలుసు తమ్మీ.. బాగున్నవానే !!

లచ్చయ్య: బాగున్నా.. ఇంత పొద్దుగాల ఫోన్‌ జేసిండ్లు !?

హరీశ్‌రావు: ఇగ జరైతే ప్రచారంలో పోవుడే గదనే.. గందుకే గిప్పుడు జేసిన.. ఓ ముచ్చట మాట్లాడేదుండె..

లచ్చన్న: చెప్పన్నా.. చెప్పన్నా..

హరీశ్‌రావు: మన పార్టీలో(టీఆర్‌ఎస్‌) మంచిగనే ఉన్నవ్‌ గదనే.. గా కాంగ్రెస్‌ నాయకునితోని నీకేం పనే? ఆయనతో ఎందుకు తిరుగుతున్నవ్‌? నేను లేనానే నీకు..? 

లచ్చన్న: లేదన్న.. నేను కాంగ్రెసోళ్లతో తిరగలె..

హరీశ్‌రావు: గట్ల జూటా మాటలు జెప్పకు లచ్చన్న. నిన్న మీ ఊళ్లె హోటల్‌ కాడికి ఇద్దరు కలిసిరాలె.. మీరు ఏం మాట్లాడుకున్నరో జెప్పనా?

లచ్చన్న: ఎందుకులె అన్నా.. ఎందుకులే..(నసిగిండు)

హరీశ్‌రావు: గిప్పుడే గదనే మనం గట్టిగ పనిజేసేది. కాంగ్రెసోళ్లతో కొట్లాడుకుంట..ఆ పార్టీల ఉన్నోళ్లతోనే తిరుగుతెట్లనే. మన పార్టీల ఉన్నోళ్లు ఏమనుకుంటరు? నలుగురికి జెప్పేటోడివి నువ్వే ఇట్ల జేస్తే యెట్లనే? 

లచ్చయ్య: తప్పైందన్నా.. తప్పైంది. ఇంకోసారి జరగకుంట సూసుకుంటన్నా..

హరీశ్‌రావు: సరే తమ్మీ..ఈ ఎన్నికలైనంక ఒకసారి సిద్ధిపేటకు వచ్చి కలువు..

లచ్చయ్య: సరే అన్నా..సరే అన్నా..

(తాను కాంగ్రెస్‌ నాయకుడితో కలిసి తిరిగింది.. హరీశ్‌ కు ఎవరు చెప్పారో లచ్చయ్య ఇప్పటికీ తెలియదు)


ఒక నేత.. 100 ఓట్లు 


సిద్దిపేట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి 100మంది ఓటర్లకు ఒక టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీని నియమించారు. వీరు ఆ 100 మందిని కలుసుకొని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. గతంలో సిద్దిపేటలో హరీశ్‌రావు ఈ విధానంతోనే లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రస్తుతం అదే తరహాలో హరీశ్‌ ముందుకెళ్తూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మిరుదొడ్డి, తొగుట, చేగుంట, నార్సింగి, దౌల్తాబాద్‌, రాయపోల్‌, దుబ్బాక మండలాల్లో 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. 100 మంది ఓటర్లకు ఒకరి చొప్పున 1500 మందికి పైగా నాయకులు పని చేస్తున్నారు.

Updated Date - 2020-10-18T09:59:23+05:30 IST