Abn logo
Oct 18 2020 @ 04:40AM

రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో చెప్పండి!

Kaakateeya

10 వేల కోట్ల బకాయిలపై మాట్లాడరేం?

బీజేపీ నేతలకు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న


మెదక్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కనీసం ఒక్క రాష్ట్రంలోనైనా కల్యాణలక్ష్మి, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలు అమలు చేస్తున్నారా? ఓవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా తిప్పలు పెడుతూ.. అదిచ్చాం.. ఇదిచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్నారు’ అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన కౌన్సిలర్‌ చందన టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ హయాంలో కల్యాణ లక్ష్మి పథకం కింద 7 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు రూ.5,500 కోట్లు, రైతుబంధు కింద అన్నదాతలకు రూ.7,250 కోట్లు ఇచ్చామని.. ఇందులో కేంద్రం వాటా ఎంతో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఈ విషయమై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఏమీ ఇవ్వకుండానే.. ఇచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన నిధులిస్తే.. ఆ మొత్తాన్ని సొంత స్థలం ఉన్న పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించుకోవడానికి కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అమాయకులు కాదని.. వాస్తవాలు వారికి తెలుసని.. బీజేపీ నేతలకు ఉప ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు. 

Advertisement
Advertisement