ధాన్యం సేకరణలో మిల్లర్లు బాగస్వామ్యం కావాలి: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2022-04-23T01:54:55+05:30 IST

తెలంగాణలో యాసంగి ధాన్యంసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొనుగోలుకేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది

ధాన్యం సేకరణలో మిల్లర్లు బాగస్వామ్యం కావాలి: మంత్రి గంగుల

హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యంసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొనుగోలుకేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వామ్యం కావాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మిల్లర్లను కోరారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో మంత్రి కమలాకర్ శుక్రవారం ఎర్రమంజిల్ లోని సివిల్ సప్లైస్ భవన్లో బేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన ఈ సమావేశం సుధీర్ఘంగా కొనసాగింది, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుండి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో మంత్రి గంగుల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను కేంద్రం నట్టేట ముంచిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు సంపూర్ణ మద్దతు దరతో తెలంగాణ రైతాంగం పండించిన చివరి గింజ వరకూ సేకరించాలని నిర్ణయించారన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచించారు, మిల్లర్ కు రైతుకు సంబందం ఎందుకని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామని ఎట్టి పరిస్తితుల్లోను ఒక్క కిలోను సైతం మిల్లుల్లో కోత పెట్టవద్దని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వేసిన కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేసారు. సీఎంఆర్ విషయంలోనూ సహకరించాలని సూచించారు. గతంలో సాగు ఇంతగా జరగలేదని, కరెంటు లేక, అటు రైతులు ఇటు రైస్ మిల్లులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల కరెంటు, సాగు నీరు, రైతు బందు, రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల రైతు విదానాలతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతన్నారనిమంత్రి పేర్కొన్నారు, 


ఒకరికొకరు అనుసంధానంగా ఉండే మిల్లర్లు సైతం బాగుపడే దశలో ఎఫ్.సిఐ ఏర్పడ్డప్పటి నుండి అనుసరిస్తున్న విదానాలను కాలదన్ని కేంద్రం రైతులతో వ్యాపారం చేయడం దురద్రుష్టం అని మంత్రి గంగుల అన్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతతో చూడాలని, ఆదాయమే కావాలంటే జీఎస్టీ, ఇన్ కంటాక్స్ వంటి వాటిలో చూసుకోవాలన్నారు.శ్రీలంక వంటి సంక్షోభం మన దగ్గర వస్తే ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదుకోలేదని అందుకే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని నీరుకార్చకుండా కనీసం 3 ఏళ్ల ఆహార నిల్వలు ఉంచుకోవాలన్నారు. అనంతరం ప్రతీ మిల్లర్ తో మంత్రి మాట్లాడారు. వారి సమస్యలను కూడా తెలుసుకుని, వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-04-23T01:54:55+05:30 IST