మంత్రి అనుచరులా...మజాకా!!

ABN , First Publish Date - 2021-09-17T05:47:19+05:30 IST

పేదలపై ప్రతాపం..

మంత్రి అనుచరులా...మజాకా!!
ప్రభుత్వ స్థలంలో తవ్విన రొయ్యల చెరువులు

పరవాడ మండలం వాడచీపురుపల్లిలో 49.54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

రొయ్యల చెరువులు తవ్విన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుయాయులు

స్థానిక వైసీపీ నేతలు సహకరించారని ఆరోపణలు

రూ.10 కోట్లు చేతులు మారినట్టు ప్రచారం

కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు

మత్స్య శాఖ ఏడీ తనిఖీలతో వెలుగులోకి..


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): పేదలపై ప్రతాపం చూపే అధికారులు...అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా మొద్దునిద్ర నటిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లిలో సుమారు రూ.50 కోట్ల విలువైన 49.54 ఎకరాల ప్రభుత్వ భూమిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు కబ్జా చేసినా అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. మంత్రి అనుచరులు ఆ భూమిలో ప్రస్తుతం రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. అయితే ఆ పక్కనే వున్న మరో 83 ఎకరాల జిరాయితీ భూముల్లో కొందరు అనధికారికంగా రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో మంత్రి అనుచరుల బాగోతం కూడా వెలుగుచూసింది. 


వాడచీపురుపల్లి పశ్చిమ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 461/2లో 49.54 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఆనుకుని మరో 83 ఎకరాలు జిరాయితీ భూమి ఉంది. ఈ భూముల్లో కొందరు అనధికార రొయ్యల చెరువులను నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు నిర్వహిస్తున్నారని, తక్షణమే సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో మత్స్య శాఖ ఏడీ గోవిందరావు రంగంలోకి దిగారు. పోలీస్‌ బందోబస్తు నడుమ ఐదు రోజుల నుంచి చెరువుల గట్లు ధ్వంసం చేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్‌ 461/2లో గల 49.54 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, దానిని ఆక్రమించి రొయ్యల చెరువులను తవ్వారని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. నిజానికి ఈ వ్యవహారం అధికారులకు ముందే తెలుసునన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మంత్రి అనుచరులే ఈ స్థలాన్ని ఆక్రమించుకుని రొయ్యల చెరువులు తవ్వినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానిక వైసీపీ నాయకులు మధ్యవర్తిత్వం నడిపారని, ఈ వ్యవహారంలో రూ.10 కోట్లు చేతులు మారాయని తెలిసింది.


అరకొరగా ఆక్రమణల తొలగింపు

మంత్రి అనుచరులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని తేలినా...పూర్తిస్థాయిలో ఆక్రమణల తొలగింపునకు మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని తహసీల్దార్‌ బీవీ రాణి వద్ద ప్రస్తావించగా...అవతలి వ్యక్తులు హైకోర్టు నుంచి స్టేటస్‌ కో తెచ్చుకున్నారని, ఈ నెల 20లోగా భూమికి సంబంధించి రికార్డులన్నీ సమర్పిస్తామని చెప్పినట్టు వివరించారు. అప్పటివరకు ఆక్రమణల తొలగింపునకు బ్రేక్‌ ఇచ్చినట్టు తెలిపారు. కాగా 49.54 ఎకరాలు ప్రభుత్వ స్థలమేనని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే తానే హైకోర్టుకు వెళ్లి స్టే తెస్తానని తహసీల్దార్‌ తెలిపారు.


ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి: బండారు

మంత్రి అనుచరులు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే చెరువులకు విద్యుత్‌ సరఫరాకు అనుమతులు ఇచ్చిన ఆర్‌ఈసీఎస్‌ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ మంత్రి బంధువులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Updated Date - 2021-09-17T05:47:19+05:30 IST