దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా...మ‌రింత ప‌క‌డ్బందీగా ఉపాధి హామీ ప‌నులు

ABN , First Publish Date - 2022-03-08T02:08:28+05:30 IST

ఉపాధి హామీ పధకాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా...మ‌రింత ప‌క‌డ్బందీగా ఉపాధి హామీ ప‌నులు

హైదరాబాద్: ఉపాధి హామీ పధకాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలోనే అత్యధిక పనిదినాలు, అత్యధిక మెటీరియల్ కాంపొనెంట్ ని వినియోగించుకుని ఉపాధి హామీ పధకంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా వుందని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం పై సోమవారం మంత్రి ఎర్ర‌బెల్లి అధ్య‌క్ష‌త‌న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్‌, చామ‌కూర మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు. ప‌డ‌క్బందీగా ఉపాధి హామీ ప‌నుల‌ను నిర్వ‌హించాల‌ని, మ‌రిన్ని ప‌నులు చేప‌ట్టాల‌ని, కేంద్రం ఉపాధి హామీ నిధుల్లో 25వేల కోట్ల కోత పెట్టినందున‌, ప్ర‌స్తుతం నిర్వ‌హించే, ఇంకా చేప‌ట్ట‌నున్న ప‌నుల‌న్నింటికీ స‌రిప‌డా నిధులు రాబ‌ట్టాల‌ని మంత్రులు అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు గ‌త ఏడాది చేప‌ట్టిన ప‌నుల‌ను స‌మీక్షించారు. త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. 


ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, ఉపాధి హామీ ప‌థ‌కాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోనే అత్య‌ధిక ప‌ని దినాలు, అత్య‌ధిక మెటీరియ‌ల్ కాంపొనెంట్ ని వినియోగించుకుని ఉపాధి హామీ ప‌నుల్లోనూ మ‌న‌మే నెంబ‌ర్ వ‌న్ గా నిలిచామ‌న్నారు. నిర్ణీత ప‌నిదినాల‌కంటే అధికంగా చేప‌ట్టామ‌న్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వారా ప‌ల్లెల రూపు రేఖ‌ల‌నే మార్చేసి అన్ని గ్రామాల‌ను ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామ‌న్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో ప‌ట్ట‌ణాల నుంచి గ్రామాల‌కు వ‌ల‌స పెరిగింద‌ని, త‌ద‌నుగుణంగా ప‌నులు, ఉపాధి క‌ల్పించిన ఘ‌న‌త కూడా మ‌న‌దేన‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఉపాధి హామీకి 25వేల కోట్ల మేర‌కు కోత విధించింద‌ని తెలిపారు. అయినా స‌రే, ఉపాధి హామీ ప‌నులు మ‌రింత‌గా చేప‌ట్టి, ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు రాబ‌ట్ట‌డానికి అధికారులు కృషి చేయాల‌ని ఆదేశించారు.


రాష్ట్రంలోని 32 జిల్లాలు 540 మండలాలు 12  వేల 769 గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది.  రాష్ట్రంలో 57 లక్షల 15 వేల జాబ్ కార్డులు 1 కోటి 23 లక్షల కూలీలకు జారీ చేయడమైనది. 2021-22 లో 28 లక్షల 3 వేల కుటుంబాలకు చెందిన 47 లక్షల  3 వేల కూలీలకు పని కల్పించడం జరిగింది. 1 లక్ష 54 వేల కొత్త జాబ్ కార్డులు 3 లక్షల 17 వేల కూలీలకు జారీ చేయడమైనది. 13 కోట్ల 75 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 13 కోట్ల 85 లక్షల పనిదినాలు కల్పించడం జరిగింది.  కేంద్ర ప్రభుత్వం అదనంగా 50 లక్షల పని దినాలకు ఆమోదం తెలిపిందని మంత్రి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. ప్ర‌తి గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంట ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, రైతు వేదిక‌లు, రైతు క‌ల్లాలు, గ్రామ నర్సరీలు చేప‌ట్టాం. హ‌రిత హారం కింద కోట్లాది మొక్క‌లు నాటి, 95శాతం మొక్క‌ల‌ను సంర‌క్షించి, 7శాతం గ్రీన‌రీని సాధించ‌గ‌లిగామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి  చెప్పారు.

Updated Date - 2022-03-08T02:08:28+05:30 IST