వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ లో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-09-15T23:35:04+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్ వేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ స‌భ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు స్వచ్చంద సంస్థలు భాగస్వామ‌లై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ లో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి

హన్మకొండ: కోవిడ్ వ్యాక్సిన్ వేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ స‌భ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు స్వచ్చంద సంస్థలు భాగస్వామ‌లై  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా మంత్రి తెలిపారు. ఈ నెల16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18సం.రాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైద‌రాబాద్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్న‌తాధికారులు, వివిధ శాఖల కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జెడ్పీ చైర్మన్లు, డిపివోలు, సీఈవో లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 


కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా పూర్తి నియంత్రణ లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదని సదుద్దేశంతో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ద‌యాక‌ర్ రావు అన్నారు.  రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు  2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని, ఇప్పటి వరకు ఒక కోటి 45 లక్షలు మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింద‌ని,  సెకండ్ డోసు వ్యాక్సినేషన్ 55 లక్షల మందికి పూర్తయిందన్నారు. 


రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలన్నారు. జిల్లా స్థాయి లో డి.ఆర్.డి.ఓ లు మహిళా గ్రూపు సంఘాలతో సమన్వయము చేసి వ్యాక్సినేషన్ అందరు తీసుకునేలా చేయాల‌న్నారు. పి.హెచ్.సి లలో ఎమర్జెన్సీ బెడ్స్ పెట్టుకోవాల‌న్నారు. సర్పంచ్ లు ఎప్పటికప్పుడు ఎ.ఎన్.యం/ఆశ కార్యకర్తలు, పంచాయతీ సెక్రటరీ, వార్డు సభ్యులతో సమన్వయం చేసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల‌న్నారు. మొదటి డోసు వ్యాక్సినేషన్ వేసుకోని వాళ్లకు వెంటనే వేయాలని, రెండవ డోసు వ్యాక్సినేషన్ తీసుకోనివారు వెంటనే వారు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌పై నిరంతరం సమీక్షించాలని రోజువారి కార్యక్రమంలో పది నిమిషాల సమయం వెచ్చించి వ్యాక్సినేషన్ పనితీరును  సమీక్షించుకోవాల‌న్నారు. కంట్రోల్ రూమ్ నిర్వహణ నిరంతరం కొనసాగుతూనే ఉండాలని, సమాచారాన్ని సేకరించి  పత్రికలకు అందజేయాలన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గా స్టిక్కర్లు వేయాలన్నారు.  గ్రామ పంచాయతీలలో దండోరా వేయించాలని, ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలన్నారు. ఒక క్రమపద్ధతిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టి మరింత ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. ఈ వీడియో కాన్ఫ‌రేన్స్‌లో ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌, పంచాయ‌తీరాజ్ శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, వైద్య ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-15T23:35:04+05:30 IST