Abn logo
Sep 26 2021 @ 23:58PM

కాకతీయుల కట్టడాల పరిరక్షకులు కేసీఆర్‌, కేటీఆర్‌

మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు

భద్రకాళి బండ్‌ వరంగల్‌ నగరానికి తలమానికం

ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హనుమకొండ సిటీ, సెప్టెంబరు 26 : కాకతీయుల కట్టడాల పరిరక్షకులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. కాకతీయరాజుల వలే వీరిద్దరూ చరిత్రలో నిలిచిపోతారన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ‘ఆజాద్‌ అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలు, వరంగల్‌ భద్రకాళి బండ్‌ సందర్శన సందర్భాలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి భద్రకాళి బండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్‌ ఉమ్మడి జిల్లా వారసత్వ సంపదలో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో సీఎం కేసీఆర్‌ కృషి అనిర్వచనీయమన్నారు. టూరిస్ట్‌ హబ్‌గా వరంగల్‌ను మార్చి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపును తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు. భద్రకాళి బండ్‌ నిర్మాణం అపురూపమన్నారు. నిర్మాణంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. రూ.2,500కోట్లతో వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో నగరం అభివృద్ధి చెందుతూ భవిష్యత్తు తరాలకు కానుకగా అందనుందన్నారు. టూరిస్ట్‌, ఎడ్యుకేషనల్‌, మెడికల్‌, ఐటీ హబ్‌గా వరంగల్‌ రూపాంతరం చెందుతోందన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. భద్రకాళి బండ్‌లో సినిమా షూటింగ్‌ల నిర్వహణకు ఇప్పటికే సినీ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. 

మేయర్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ.. ఆరోగ్య వరంగల్‌గా నగరం మారేందుకు భద్రకాళి బండ్‌ ఉపయుక్తమవుతుందని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్‌, జిమ్‌ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. అమృత్‌, స్మార్ట్‌సిటీ నిధులతో భద్రకాళి బండ్‌ నిర్మాణమైందన్నారు. రెండోదశ నిర్మాణ పనులను స్మార్ట్‌సిటీ ద్వారా రూ.65 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. వరంగల్‌-హైదరాబాద్‌ రహదారి ఇండస్ట్రీయల్‌ కారిడార్‌గా అభివృద్ధి చెందనుందని, ఈ మేరకు అనుమతులు జారీ అయినట్లు రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ పేర్కొన్నారు. కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి  మాట్లాడుతూ.. దేశంలోనే భద్రకాళి బండ్‌ అతి పెద్దదన్నారు. తొలి, రెండో దశలలో మొత్తంగా 306 కిలోమీటర్ల పొడవునా భద్రకాళి బండ్‌ నిర్మాణం పూర్తి చేసుకోనుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ సుధీర్‌బాబు, కుడా వైస్‌ చైర్మన్‌ ప్రావీణ్య, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 

మాట్లాడుతున్న చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌


విద్యుత్‌ వెలుగుల్లో భద్రకాళి బండ్‌