‘రూర్బన్‌’ పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2020-07-10T10:21:45+05:30 IST

జిల్లాలోని పర్వతగిరి మండలంలో జరుగుతున్న రూర్బన్‌ పథకం పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

‘రూర్బన్‌’ పనుల్లో వేగం పెంచాలి

సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, జూలై 9: జిల్లాలోని పర్వతగిరి మండలంలో జరుగుతున్న రూర్బన్‌ పథకం పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కంట్రాక్టర్ల కాంట్రాక్ట్‌ను రద్దుచేసి వారిని బ్లాక్‌ లిస్టులో పెట్టేలా చూడాలన్నారు. హన్మకొండలోని వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం పర్వతగిరి రూర్బన్‌ పనుల పురోగతిపై కలెక్టర్‌ ఎం.హరిత అధ్యక్షతన మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి సమీక్షించారు. 


ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ పర్వతగిరిలో రూర్బన్‌ పనులను ప్రణాళికలకు అనుగుణంగా అఽధికారులు చేయకపోవడం తగదన్నారు. ఏడాది కావస్తున్నా ఇంకా కొన్ని పనులు ప్రారంభించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ శాఖల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ నెల 25న వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకు రానున్న క్రమంలో పనులు పూర్తియి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ మండలంలో రూర్బన్‌ కింద చేపడుతున్న పనులు ప్రణాళికలకు అనుగుణంగా చేయాలన్నారు. విద్య, ఆరోగ్య, వ్యవసాయ, క్రీడలు, సుందరీకరణ పనుల విషయంలో ప్రత్యేక దృష్టి చేపట్టాలన్నారు. కలెక్టర్‌ ఎం.హరిత మాట్లాడుతూ రూర్బన్‌ పథకానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు పనుల విషయంలో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మహేందర్‌జీ, డీఆర్‌డీవో సంపత్‌రావు, జేడీ ఉషాదయాళ్‌, నారాయణ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా, మండల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-10T10:21:45+05:30 IST