విద్యార్థులకు శిక్షణ ద్వారా సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-23T20:07:59+05:30 IST

విద్యార్ధులకు వారికి నైపుణ్యం ఉన్న అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

విద్యార్థులకు శిక్షణ ద్వారా సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి: ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లా: విద్యార్ధులకు వారికి నైపుణ్యం ఉన్న అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకంలో భాగంగా ఎంపికైన తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, నీతి ఆయోగ్ కింద దేశంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ని నెలకొల్పింది. యువ శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఈ మిషన్ ద్వారా దేశంలో 9వేల 500 అటల్ టింకరింగ్ ల్యాబ్ లను నెలకొల్పారు. ఒక్కో ల్యాబ్ విలువ 20 లక్షలుంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఐదు పాఠశాలలు ఈ పథకం ఎంపికయ్యాయని చెప్పారు. మూడు ప్రభుత్వ పాఠశాలలు రెండు ప్రైవేట్ పాఠశాలలు ఈ జాబితాలో ఉండగా తొర్రూరు ప్రభుత్వ పాఠశాల కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కు ఎంపిక అవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టం. 


దేశంలో మొత్తం 75 లక్షల మంది విద్యార్థులకు కు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని పెంపొందించి నిగూఢమైన శక్తిని వెలికి తీసి యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలి అనేది ఈ మిషన్ సంకల్పం.విద్యార్థులు చేసే ప్రయోగాలను ఆన్లైన్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ విద్యార్థులకు తగిన సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం ద్వారా మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా శాస్త్రవేత్తలు గా తయారై ఈ ప్రపంచాన్ని మరింత సమర్థవంతంగా సానుకూలంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T20:07:59+05:30 IST