అనాథ బిడ్డలకు భరోసాకల్పించాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-23T21:42:26+05:30 IST

అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వాళ్లకి మేము న్నామని భరోసా కల్పించడం మనందరి బాధ్యత అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అనాథ బిడ్డలకు భరోసాకల్పించాలి: మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్: అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వాళ్లకి మేము న్నామని భరోసా కల్పించడం మనందరి బాధ్యత అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అనాధ పిల్లల కోసం ఒక సమగ్ర పకడ్బంది చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే అనాధల చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చిందని, సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత అది ఒక సమగ్ర చట్టం రూపు దిద్దుకుంటుందని మంత్రి చెప్పారు.మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు కేంద్రంలోని సెయింట్ పాల్స్ స్కూల్ లో అనాథ పిల్లలతో మంత్రి కొంత సమయం గడిపారు. 


కొద్దిసేపు వారితో మాట్లాడారు. వారి మంచి చెడులు తెలుసుకున్నారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అనాధ అయిన తీరు... వాళ్లు ప్రస్తుతం ఆశ్రమంలో ఎలా ఉన్నారు? వారి స్థితిగతులు ఏంటి? వారికి అందుతున్న వసతులు ఏంటి? వంటి విషయాలపై ఆరా తీశారు. కుశల ప్రశ్నలు వేశారు. అలాగే వారి చదువులు, వస్తున్న మార్కులు, భవిష్యత్ లక్ష్యాలు వంటి అనేక అంశాలను వారి ముందు ప్రస్తావించారు. వారితో కలిసి  టీ తాగారు. స్నాక్స్ తిన్నారు. వారి అభిరుచులు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెళ్లపోతుండగా  క్రమశిక్షణతో నిలబడి, టాటా చెప్పి, ఆ పిల్లలు అత్యంత ఆత్మీయ వీడ్కోలు పలికారు. 

Updated Date - 2022-04-23T21:42:26+05:30 IST