చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలే: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-15T22:25:24+05:30 IST

చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలే... ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలే... అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలే: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలే... ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలే... అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. "మన ఊరు - మన బడి" తో సర్కారు బడులకు మహర్దశ రావాలి. ఈ పథకంతో మన గ్రామాల బడులు బాగు పడాలని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు ప్రభుత్వ పాఠశాలలో "మన ఊరు - మన బడి" కార్యక్రమంలో భాగంగా విద్యుదీకరణ, మరమ్మతులు, నూతన గదుల నిర్మాణం, ఫర్నీచర్, పెయింటింగ్స్, రాత బోర్డుకు, ప్రహారీ గోడ, నిరంతర నీటి సరఫరా, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ వంటి పలు సదుపాయాల కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, గ్రామ ప్రజల హర్ష ద్వానాల మధ్య మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం, సంక్షేమానికి తెలంగాణా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. సంక్షేమ, అభివృద్ది పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. 


సీఎం కేసీయార్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది విజయవంతం అవుతుంద నడానికి రైతు బంధు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, 24 గంటల కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి పథకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని వివరించారు.తమ పాఠశాలకు అదనపు గదులు, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి సౌకర్యాలు కావాలని అడిగిన కొండూరు స్కూల్ విద్యార్థులు శ్రావణి, లావణ్య, చరణ్ ల కోరిక మేరకు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు 1 కోటి రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారుల పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపేలా సర్కారు బడులను బలోపేతం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-15T22:25:24+05:30 IST