ప్రజలకు సేవ చేస్తేనే ప్రజా ప్రతినిధులకు సార్ధకత- ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-08-08T22:49:23+05:30 IST

రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు , ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏకం కావాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు పిలుపునిచ్చారు

ప్రజలకు సేవ చేస్తేనే ప్రజా ప్రతినిధులకు సార్ధకత- ఎర్రబెల్లి

హైదరాబాద్‌: రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు , ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏకం కావాలని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ కరోనాను కట్టడి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు ,యూత్‌ని ఏకం తాటిపైకి తీసుకు రావాలన్నారు. గ్రామ మండలస్తాయిలో కమిటీలు వేయాలి. కమిటీలు ఎప్పటికప్పుడు సమన్వయం అవుతూ కరోనా బాధితులను ఆదుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుంచి పాలకుర్తినియోజక వర్గంలోని ఆయా మండలాల నుంచి 120కి పైగా ప్రజా ప్రతినిధులు, ఆర్డీవో  సహా అన్నిశాఖల అధికారులు, పోలీసులు, పలువురు ప్రముఖులతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 


ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందన్నారు. ఈ మహమ్మారికి మందు లేదు. టీకాలు రాలేదు. దేశ దేశాలు దాటి మన దేశానికి వచ్చింది. మహానగరాలు, నగరాలు, పట్టణాలు దాటి పల్లెలకు కూడా పాకింది. ఇక దీనిని కంట్రోల్‌ చేయాలి. మరో రెండు నెలలు కఠినంగా ఉండాలని మంత్రి తెలిపారు. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో రాజకీయాలకు అతీతంగా కమిటీలను వేయాలని ఆదేశించారు. ప్రజలకు సేవ చేస్తేనే ప్రజా ప్రతినిధులు, అధికారులకు సార్ధకత , సంతృప్తి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అరుదైన ప్రజా ప్రాతినిధ్యం , అధికారులుగా అవకాశాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే నిజమైన అవకాశం వచ్చిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Updated Date - 2020-08-08T22:49:23+05:30 IST