హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం, బియ్యం కొనుగోళ్ళలో కేంద్రం అలసత్వాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దయెత్తున ఆందోళనలకు సిద్ధమవుతుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆందోళనల్లో భాగంగా ఈ నెల 24న పాలకుర్తి లో నిర్వహించనున్న నియోజకవర్గ ఇన్ చార్జీల సన్నాహక సమావేశం స్థలాన్ని మంత్రి పరిశీలించారు. పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్ లో నిర్వహించనున్న ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి ఇన్ చార్జీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, రైతు సమన్వయ సమితిల బాధ్యులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.
ఇప్పటికే సీఎం కేసిఆర్ ఈ యాసంగిలో బియ్యం కాదు. ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా, పంజాబ్ తరహా తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయమై అటు రైతాంగాన్ని, ఇటు పార్టీ శ్రేణులని, ప్రజలని భాగస్వాములను చేస్తూ, పెద్ద ఎత్తున ఉద్యమించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. కాగా, మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి