రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-10-17T11:23:31+05:30 IST

భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ అప్పలరాజు అన్నారు.

రైతులను ఆదుకుంటాం

మంత్రి డాక్టర్‌ అప్పలరాజు


ఏలూరు రూరల్‌, అక్టోబరు 16 : భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ అప్పలరాజు అన్నారు. అధిక వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన లంక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, రాష్ట్ర విపత్తులు, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబుతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఏలూరు రూరల్‌ మండలం శ్రీపర్రు కాజ్‌వే ప్రాంతంలో వరద ముంపునకు గురైన చేపల చెరువులను, మృత్యువాత పడిన చేపలను పరిశీలించారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ‘ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. ఆక్వా రంగ రైతులు కుదేలయ్యారు. వరద తాకిడితో చె రువు గట్లు తెగి చేపలు, రొయ్యల ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చెరువుల్లో నీరు పూర్తిగా తొలగిన అనంతరం తుది నివేదికను సీఎంకు అందజేసి రైతులను ఆదుకుంటాం’ అని చెప్పారు.


ఉప ముఖ్యమంత్రి నాని మాట్లాడుతూ ‘వ్యవసాయ, అనుబంధ రంగాలపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా పడింది. కొల్లేరు ప్రాంతంలో సుమారు 2,800 హెక్టార్లలో చేపల చెరువులు దెబ్బ తిని 1,600 మంది రైతులు నష్టపోయారు. వీరిని అన్ని విధాలా ఆదు కుంటాం’ అని చెప్పారు. అక్కడ నుంచి జాలిపూడి, అక్కడ నుంచి బయలుదేరి చాట పర్రు, కెడిపురం, మొండికోడు, గుడివాకలంక గ్రామాల్లో పర్యటించారు. రహదారి పై వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో మంత్రులు, అధికారులు పడవ పై ప్రయాణం చేసి గుడివాకలంక చేరుకున్నారు. జేసీ వెంకటరమణారెడ్డి,  ఆర్డీవో పనబాక రచన, తహసిల్దార్‌ బి.సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T11:23:31+05:30 IST