మంత్రి డెవలపర్స్‌ సీఎండీ అరెస్టు

ABN , First Publish Date - 2022-06-26T07:39:24+05:30 IST

మంత్రి డెవలపర్స్‌ సీఎండీ అరెస్టు

మంత్రి డెవలపర్స్‌ సీఎండీ అరెస్టు

‘మంత్రి’తో...ముఖ్యమంత్రి జగన్‌కు లింకు! అవినీతి లావాదేవీలున్నట్టు ఆరోపణలు

హైదరాబాద్‌లో భూములిచ్చి బెంగళూరులో భవనం

విచారణ చేయాలంటూ నాడు సీబీఐకి ఈడీ లేఖ

సుశీల్‌ మంత్రిపై బెంగళూరులో ఏడు కేసులు


అమరావతి, బెంగళూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మంత్రి డెవలపర్స్‌ సీఎండీ సుశీల్‌ మంత్రిని శనివారం బెంగళూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్టు చేసింది. సుశీల్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కి మధ్య సంబంధాలు ఉన్నాయంటూ గతంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి డెవలపర్స్‌పై 2019 జూలైలో బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మంత్రి గ్రూప్‌పై ఐటీ దాడి జరిగింది. ఆ సమయంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. వాటిని సమగ్ర విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అప్పగించింది. వ్యక్తిగత, సంస్థకు సంబంధించిన వ్యవహారాలలో ఆరోపణలు రావడంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌కు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని సుశీల్‌ మంత్రికి ఇటీవలే ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు వెళ్లగా సుదీర్ఘంగా విచారించారు. ఆ మరునాడు అరెస్టుచేసి కోర్టుకు హాజరుపెట్టారు. 


అవినీతి లింకులు..

మంత్రి డెవలపర్స్‌తో జగన్‌ అవినీతి కేసులకు సంబంధాలున్నాయి. వీటిపై విచారణ చేయాలంటూ డైరక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 2017లో సీబీఐ డైరక్టర్‌ అలోక్‌కుమార్‌ వర్మకు లేఖరాశారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గతంలో సీబీఐ కేసులు నమోదుచేసింది. ఆ కేసుల్లో మంత్రి డెవలపర్స్‌ వ్యవహారం కూడా ఒకటి. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిడెవలపర్స్‌కు సంబంధించిన కంపెనీకి హైదరాబాద్‌ సమీపంలో విలువైన భూములు కేటాయించి...దానికి ప్రతిగా బెంగళూరులో మంత్రి డెవలపర్స్‌కు చెందిన ఒక భారీ వాణిజ్య భవనాన్ని  సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కూడా విచారణ జరిపింది. ఈ వ్యవహారాల్లో ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఈడీ డైరక్టర్‌... సీబీఐ డైరక్టర్‌కు లేఖ రాయడం అప్పట్లో సంచలనమైంది. జగన్‌కు సంబంధమున్న కంపెనీలు, ఆయన పత్రికలో పెట్టుబడి పెట్టిన కంపెనీలపైనా ఈడీ, ఆదాయపు పన్ను శాఖ విచారణ చేయాలని ఆయన ఈలేఖలో పేర్కొన్నారు. సండూర్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌, జూబ్లి మీడియా కమ్యూనికేషన్స్‌, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సరస్వతి పవర్‌, ఇండస్ర్టీస్‌, మంత్రి డెవలపర్స్‌ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలపై విచారణ చేయాలన్నారు. ఈ కంపెనీలతో జగన్‌ క్విడ్‌ప్రోకో సంగతిని నిరూపణ చేయలేకపోయినా...ఈడీ, ఆదాయపు పన్ను శాఖల చట్టాల ఉల్లంఘన కనిపిస్తోందని, వీటిపై విచారణ చేయవచ్చని పేర్కొన్నారు. నాడు ఈడీ డైరక్టర్‌ రాసిన లేఖలో ఉన్న మంత్రి డెవలపర్స్‌ సంస్థ సీఎండీనే ఇప్పుడు అరెస్టుచేయడం గమనార్హం. 

Updated Date - 2022-06-26T07:39:24+05:30 IST