ఉద్యోగులు... ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే: మంత్రి Botsa

ABN , First Publish Date - 2022-02-05T17:47:49+05:30 IST

ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు ఒప్పుకోవాల్సిందే అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఉద్యోగులు... ప్రభుత్వ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే: మంత్రి Botsa

అమరావతి: ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు ఒప్పుకోవాల్సిందే అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... నిన్న అర్ధరాత్రి వరకు ఉద్యోగ సంఘం నేతలతో చర్చించామని తెలిపారు. ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని... ఉద్యోగుల అపోహలు తొలగించామన్నారు. ఉద్యోగుల డిమాండ్స్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పుడు చర్చిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. ఐఆర్ రికవరీ, హెచ్‌ఆర్ఏ పైనే ప్రధానంగా ఆర్థికశాఖ అధికారులతో చర్చించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 


కాగా... ఉద్యోగుల ‘‘చలో విజయవాడ’’ విజయవంతం అవడం ప్రభుత్వానికి పెద్ద షాక్‌నిచ్చింది. దీంతో వెంటనే సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉద్యోగులు ప్రకటించిన సమ్మెను ఆపే ప్రయత్నాలు చేపట్టింది. అన్నిరకాల ప్రత్యామ్నాయాలను ఆలోచించి పెట్టుకుంది. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు సీనియర్‌ మంత్రులు, అధికారులతో సీఎంతో చర్చలు జరిగాయి. గురువారం నాటి పరిణామాలు, శుక్రవారం సచివాలయంలో ఉద్యోగుల పెన్‌డౌన్‌ వంటి ఆందోళనలపై చర్చ జరిగినట్లు తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఏం చేయాలి... ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటన్న అంశాలపై సీఎం చర్చించినట్లు తెలిసింది. 


ప్రభుత్వకార్యాలయాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల సమ్మె

మరోవైపు ఉద్యోగులు సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్‌డౌన్, యాప్ డౌన్ చేసి విధులను బహిష్కరించారు. కార్యాకలాపాలు నిలిచి పోవడంతో ప్రజలు వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని.. స్టీరింగ్ కమిటీ ఆదేశాలతో కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు.

Updated Date - 2022-02-05T17:47:49+05:30 IST