Minister Botsa: అనుకుంటే.. విశాఖను సగం దోచుకునే వాళ్ళం..

ABN , First Publish Date - 2022-09-25T21:16:23+05:30 IST

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిందని...

Minister Botsa: అనుకుంటే.. విశాఖను సగం దోచుకునే వాళ్ళం..

విశాఖ (Visakha): రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిందని మంత్రి బొత్స సత్యానారాయణ (Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. ఆదివారం విశాఖలో జరిగిన  రౌండ్ టేబుల్ సమావేశం (Round Table Meeting)లో మంత్రి మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఖర్చు ఎక్కువ పెట్టాల్సి ఉందన్నారు. రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారని, అప్పటి ప్రభుత్వం, అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలన్నింటికీ తాము కట్టుబడి ఉన్నామన్నారు. అక్కడ  రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్స్ కూడా  జరిగాయన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకంకాదని స్పష్టం చేశారు. దండయాత్రలు చేయడం, అడ్డుకోవడం సరికాదన్నారు. మనం వ్యవస్థలో ఉన్నామన్న విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. 


ప్రభుత్వంలో ఉన్నవారు అరిటాకు లాంటి వారని.. ప్రతిపక్షంలో ఉన్న వారు ముళ్ళు వంటివారని.. మనం జాగ్రత్తగా ఉండాలని మంత్రి బొత్స అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ (Executive Capital) పెడితే.. వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధాని వ్యతిరేకించిన టీడీపీ నేతలు.. ఇక్కడ తలెత్తుకొని ఎలా తిరుగుతారన్నారు. అమరావతి రైతులను అడ్డుకోవడం.. తమకు ఐదు నిమిషాల పని అని, అయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నామన్నారు. తాము దోచుకోవాలని అనుకుంటే.. విశాఖను సగం దోచుకునే వాళ్ళమని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాల్సిందేనని, మూడు రాజధానుల సీఎం జగన్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు కూడా ఒక బెంచ్ కావాలని న్యాయవాదులు కోరుతున్నారని మంత్రి బొత్స అన్నారు.


కాగా రౌండ్ టేబుల్ సమావేశంలో కొందరు వైసీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అమరావతి రైతుల పాదయాత్రను తరిమికొట్టాలంటూ.. కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీరియస్‌ అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయొద్దన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-25T21:16:23+05:30 IST