చంద్రబాబు అసత్య ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి బొత్స
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తోన్న సంక్షేమ పథకాల ప్రజా రంజక పాలనకు ప్రజామోదం ఉంది. దీనికి మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు దర్పణం పడుతున్నాయి’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరులను ఆదరించిన విధంగానే మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించారని చెప్పారు. మునిసిపాలిటీల్లో 20,197 వార్డులకు గాను 571 మంది వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. పన్నులు పెంచుతామంటూ చంద్రబాబు చేస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజల వైద్య అవసరాలను తీర్చేందుకు వీలుగా త్వరలోనే 550 అర్బన్ క్లినిక్లను ప్రారంభిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.