ఇళ్ల పంపిణీని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు

ABN , First Publish Date - 2020-07-07T08:30:23+05:30 IST

‘‘లోక కల్యాణార్థం రుషులు చేసే తపస్సులను రాక్షసులు భగ్నం చేసేవారని పురాణాల్లో ..

ఇళ్ల పంపిణీని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు

టీడీపీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌

ఆగస్టు 15న పంపిణీ చేస్తామని వెల్లడి



అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘‘లోక కల్యాణార్థం రుషులు చేసే తపస్సులను రాక్షసులు భగ్నం చేసేవారని పురాణాల్లో చదువుకున్నాం. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్‌ చేపట్టిన ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా తామూ రాక్షసులమేనని చంద్రబాబు, టీడీపీ నేతలు చాటుకుంటున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి సొంత గూడు కల్పించాలనే ఆశయంతో తమ ప్రభుత్వం  చేపట్టిన కార్యక్రమం ఈనెల 8న జరగాల్సి ఉందన్నారు.


న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా దానికి అడ్డంకులు సృష్టించారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా ఆగస్టు 15న పంపిణీ చేస్తామన్నారు. విజయవాడలోని ఏపీసీఆర్డీయే కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గద్దెపై ఉన్నప్పుడు భారీ ప్రకటనలు చేయడమే కాకుండా పేదల కోసం నిర్మిస్తామన్న వేలాది గృహాలను పునాదుల దశలోనే నిలిపివేశారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 


అందుకే అమరావతిలో పర్యటించా

శాసన రాజధానిగా అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తమప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స చెప్పారు. దీనిలో భాగంగా తాను ఇటీవల అమరావతిలో పర్యటించానన్నారు. కృష్ణానది కరకట్ట విస్తరించి, 75 శాతానికి పైగా పనులు జరిగిన కట్టడాలను పూర్తి చేస్తామని, రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్లను అభివృద్ధి చేస్తామన్నారు. అయితే కరకట్టను మాత్రమే విస్తరించి, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ఇప్పట్లాగే వదిలేస్తే, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి రాజధాని ఎలా అనుసంధానమవుతుందన్న ప్రశ్న కు పొంతనలేని జవాబులిచ్చారు.


టిడ్కో ఫ్లాట్లు ఉచితం

ఏపీ టిడ్కో సంస్థ నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో 300చదరపు అడుగులుండే అపార్ట్‌మెంట్లను అర్హులకు ఉచితంగా అందజేస్తామని బొత్స తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వీరికి బ్యాంక్‌ల నుంచి రూ.3,25,000 వరకు రుణాలను ఇప్పించి, విక్రయించిందన్నారు. సీఎం జగ న్‌ లబ్ధిదారులపై అంతటి భారం మోపడం తగదని చెప్పడంతో వారికి ఇళ్లను ఉచితంగా ఇస్తామన్నారు. 

Updated Date - 2020-07-07T08:30:23+05:30 IST