త్వరలో రెడ్డి కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2022-06-25T09:00:25+05:30 IST

సాధ్యమైనంత త్వరగా రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు హామీని నేరవేర్చేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటుకు

త్వరలో రెడ్డి కార్పొరేషన్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా

అభివృద్ధి మా కులం.. సంక్షేమం మా మతం

సిరిసిల్లలో మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూకు 

త్వరలో సీఎం చేతులమీదుగా శంకుస్థాపన

రెడ్డి సంక్షేమ సంఘం సిరిసిల్ల జిల్లా నూతన

కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కేటీఆర్‌

రెడ్డి భవన్‌ నిర్మాణానికి మంత్రి భూమిపూజ


సిరిసిల్ల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): సాధ్యమైనంత త్వరగా రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు హామీని నేరవేర్చేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటుకు హామీ ఇచ్చామని, అయితే.. కరోనా వల్ల కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. సిరిసిల్లలో నాలుగు ఎకరాల స్థలంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు.


అనంతరం రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డితోపాటు 26 మంది కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కులం, మతం ఏదైనా పేదరికం ఒకటేనని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏ పథకం తీసుకవచ్చినా పేదవారందరికీ న్యాయం జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. కేసీఆర్‌ రైతుబిడ్డ కాబట్టే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. అభివృద్ధి తమ కులమని,  సంక్షేమం తమ మతం అని అభివర్ణించారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయతో మంత్రిని అయ్యానని, అమెరికా వెళ్లినా, దావోస్‌ వెళ్లినా లభించే గౌరవం నాకు సిరిసిల్ల ప్రజలు ఇచ్చిందేనని అన్నారు. సిరిసిల్లలో పద్మశాలి, రెడ్డి సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించామని, త్వరలోనే యాదవ, కుర్మ, మున్నూరుకాపు, ముదిరాజ్‌, గంగపుత్రులు, గౌడ కులాలకూ స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.


కేటాయించిన స్థలంలో ఫంక్షన్‌హాల్‌తోపాటు బాలబాలికలకు వేర్వేరుగా హాస్టళ్లను నిర్మించాలని సూచించారు. సిరిసిల్లలో త్వరలోనే మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ కుల సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్‌.. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కాగా, కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. 

Updated Date - 2022-06-25T09:00:25+05:30 IST