రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు

ABN , First Publish Date - 2022-05-03T18:35:48+05:30 IST

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అక్రమాల్లో తన సోదరుడి ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో మంత్రి అశ్వత్థనారాయణ స్పందించారు. బెంగళూరులో

రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు

                           - మంత్రి అశ్వత్థనారాయణ


బెంగళూరు: సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అక్రమాల్లో తన సోదరుడి ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో మంత్రి అశ్వత్థనారాయణ స్పందించారు. బెంగళూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎస్‌ఐ నియామకాలకు సంబంధించి ఎవరికీ సిఫారసు చేయలేదన్నారు. సాయం చేస్తానని కూడా ఎవరికీ చెప్పలేదన్నారు. పేరు చెప్పకుండానే కాంగ్రెస్‌ నాయకులు గాలిలో తుపాకీ పేల్చినట్లుగా ఆరోపణలు చేశారన్నారు. విమర్శలు చేసినవారు స్పష్టత ఇవ్వాలన్నారు. మంత్రి తమ్ముడై ఉండవచ్చునని  మసిపూసేలా మాట్లాడరాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి కుట్రలు సరికాదన్నారు. విమర్శ చేసేందుకు ధైర్యం ఉండాలన్నారు. శివకుమార్‌ చెప్పారంటే దాని వెనుక దురుద్దేశం ఉంటుందనేది తెలుస్తోందన్నారు. అశ్వత్థనారాయణ ముఖ్యమంత్రి అవుతారనే భయం డీకే శివకుమార్‌ను వెంటాడుతోందన్నారు. ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారన్నారు. తనకు ఎవరితోనూ సంబంధం లేదని, దర్శన్‌గౌడ పేరు ఇప్పుడే వింటున్నానన్నారు. రూ.80 లక్షలు ఇచ్చారనేది పూర్తిగా అసత్యమన్నారు. సతీష్‌ అనే అన్న ఉన్నారని, అతడిపై ఆరోపణలు చేశారు కదా సాక్ష్యాలు చూపాలంటూ నిలదీశారు. విచారణలో వాస్తవాలు తేలుతాయన్నారు.

Read more