Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీ సేవలు మాకొద్దు!

- వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు మండిపాటు

- సచివాలయాలకు వస్తే తరిమికొట్టాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు పిలుపు

- కాశీబుగ్గలో కలెక్టర్‌ సమక్షంలోనే చిందులు

- సీదిరి వ్యాఖ్యలపై వీఆర్వోల నిరసన

(పలాస, డిసెంబరు 1)

‘వీఆర్వోల సేవలు మా నియోజకవర్గానికి అవసరం లేదు. సచివాలయాలకు వీఆర్వోలు వస్తే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తరిమికొట్టాలి’ అని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సాక్షాత్తూ కలెక్టర్‌  శ్రీకేష్‌ లఠ్కర్‌ సమక్షంలోనే చిందులు తొక్కారు. బుధవారం కాశీబుగ్గలోని టీకేఆర్‌ కల్యాణ మండపంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై మండిపడిన సంఘటన వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ టి.రాజగోపాల్‌ ఆధ్వర్యంలో ఓటీఎస్‌పై నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం వీఆర్వోలు కూడా సమీక్షకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో సమీక్షకు మీరెందుకు వచ్చారని, బయటకు వెళ్లిపోవాలని వీఆర్వోలకు కమిషనర్‌ ఆదేశించారు. దీంతో వారంతా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో సమీక్షకు ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు మంత్రి అప్పలరాజు అక్కడకు రాగా.. వారంతా ఆయనను ఘెరావ్‌ చేశారు. తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రాజకీయం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నారా? అంటూ.. తనను కలవడానికి వచ్చిన వీఆర్వోలను మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వీఆర్వోలతో పాటు తహసీల్దారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తర్వాత తన దృష్టికి తీసుకురావాలని, సమీక్ష సమయంలో ఇలా వ్యవహరించడం తగదని స్పష్టం చేశారు. సీఐ ఎస్‌.శంకరరావు వీఆర్వోలను అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో సమీక్షను బహిష్కరిస్తూ.. వీఆర్వోలు నిరసన తెలిపారు. అనంతరం వేదికపై మంత్రి, కలెక్టర్‌ ఆశీనులయ్యారు. సమీక్షలో మంత్రి అప్పలరాజు ప్రసంగిస్తూ.. వీఆర్వోల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరించిన.. వీఆర్వోల సేవలు పలాస నియోజకవర్గానికి అవసరం లేదన్నారు. రేపటి(గురువారం) నుంచి సచివాలయాలకు వీఆర్వోలు వస్తే ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వారిని తరిమివేయాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో పాల్గొన్న వీఆర్వోలందరికీ మెమోలు ఇవ్వాలని కలెక్టర్‌, తహసీల్దారులకు ఆదేశించారు. దీంతో వేదికపై ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. ప్రజాప్రతినిధులు చప్పట్లతో హోరెత్తించారు. రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు మాత్రం అసహనం వ్యక్తం చేశారు. వీఆర్వోలు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ను నేరుగా కలిసి జరిగిన సంఘటనను వివరిస్తామని స్పష్టం చేశారు. తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 


తహసీల్దార్లతో మంత్రి వాగ్వాదం

మందస, వజ్రపుకొత్తూరు, పలాస తహసీల్దారులు బి.పాపారావు, అప్పలస్వామి, ఎల్‌.మధుసూదనరావులతో మంత్రి అప్పలరాజు వాగ్వాదానికి దిగారు. వీఆర్వోలను కట్టడి చేయలేని అధికారులు ఎందుకని మంత్రి ప్రశ్నించగా.. అందుకు ధీటుగా తహసీ ల్దారులు బదులిచ్చారు. వీఆర్వోలను అవమానపరిచారని, వారు చేసిన తప్పేమీ లేదని సమర్థించారు. సమావేశాలకు పిలిచి అవమానించడం ఎందుకని మంత్రితో వాదించారు. చివరకు ప్రజాప్రతినిధులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 


కమిషనర్‌ అవమానించారు

మునిసిపల్‌ కమిషనర్‌ మమ్మల్ని సమావేశం నుంచి ‘గెటౌట్‌’ అంటూ అవమాన పరిచారు. తహసీల్దారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇలా ఆదేశించడం అన్యాయం. కమిషనర్‌ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. 

- వీఆర్వో సంఘ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌

Advertisement
Advertisement