లోకేష్‌పై మంత్రి అనిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-30T23:22:45+05:30 IST

నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోకేష్‌పై మంత్రి అనిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

నెల్లూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసి లోకేష్‌ను కిందికి దించేయడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ను ‘పుష్ప మహారాజ్’ అంటూ మంత్రి సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు.


లోకేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు..

నారా లోకేష్‌ ఆరోపణలకు సమాధానం చెప్పడమే మా ఖర్మ. పప్పుబాయ్ మంగళగిరిలో నీకు అదే గతి. గోచికూడా మిగలదు. ఎంత మంది కట్టకట్టుకుని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయ్యారు. టీడీపీ నేతలు మర్యాదగా మాట్లాడితే మార్యాదగా మాట్లాడుతాం.  నీ లాగా, మీ బాబులాగా మీ తాత పార్టీ లాక్కొని జగన్ సీఎం కాలేదు. దేశంలోనే రైతుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించిన నేత జగన్. లోకేష్‌ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలి. మీపార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పోలవరం పనులు 70 శాతం పూర్తయితే మీసాలు తీసేస్తానన్న నేత ఎక్కడా అని మీసాలు లేని నేత మాట్లాడుతున్నారు. లక్ష కుటుంబాలున్నాయి.. వారందరికీ ఇళ్లు నిర్మించాలి. 50 శాతమే పూర్తయ్యాయంటే వినరు. ఏ కమీషన్ల కోసం కేబినెట్ నోట్ పెట్టారో చెప్పండి. పోలవరం పూర్తిచేసి తీరుతాం. శాన్ ఫోర్డ్ వీరుడు, పప్పు వీరుడు. ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టో జగన్ క్యాబినేట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యాను. జగన్ పాదం వల్లే రెండేళ్లుగా డ్యామ్‌లు అన్నీ నిండుతున్నాయి. మీ తాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో (లోకేష్) ఓడిపోయావ్అని లోకేష్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా లోకేష్ ట్రాక్టర్ నడపడంపై ఇదివరకే మంత్రి కొడాలి నాని స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


ఇంతకీ లోకేష్ ఏమన్నారు..!?

ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటానన్న ఆ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమని వాపోయారు. 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని, జగన్ ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. కానీ మీటర్లను అంగీకరించమని, వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని తేల్చి చెప్పారు. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే.. నష్టం అంచనా 100శాతం చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలన్నారు. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-10-30T23:22:45+05:30 IST