Chinnaselam విద్యార్థులకు సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2022-07-20T13:30:08+05:30 IST

చిన్నసేలంలోని శక్తి ఇంటర్నేషనల్‌ స్కూలు విద్యార్థులందరికీ మార్కుల జాబితా, టీసీ, కుల, జనన ధ్రువీకరణ పత్రాలను వీలైనంత

Chinnaselam విద్యార్థులకు సర్టిఫికెట్లు

                       - మంత్రి అన్బిల్‌ మహేష్‌


చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): చిన్నసేలంలోని శక్తి ఇంటర్నేషనల్‌ స్కూలు విద్యార్థులందరికీ మార్కుల జాబితా, టీసీ, కుల, జనన ధ్రువీకరణ పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాలని అక్కడి అధికారులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చిన్నసేలం ప్రైవేటు పాఠశాల వద్ద ఆదివారం జరిగిన హింసాకాండలో దుండగులు నిప్పంటించడంతో ఆ పాఠశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థుల సర్టిఫికెట్లు దగ్ధమయ్యాయని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధికారులు, మంత్రులతో సమీక్షించిన మీదట విద్యార్థులకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు, మార్కుల జాబితా నకళ్ళను వెంటనే అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం తాను ఇతర మంత్రులతో కలిసి ఆ స్కూలు ప్రాంతాన్ని పరిశీలించానని, కోర్టులో కేసుల విచారణ జరుగుతుండటంతో విద్యార్థిని శ్రీమతి తల్లిదండ్రులను కలుసుకోలేకపోయామని తెలిపారు. విద్యార్థిని తల్లి ఎంకామ్‌ పట్టభద్రురాలని, ఆమె ఏదైనా ఉద్యోగావకాశం కల్పించాలంటూ చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. శక్తి ఇంటర్నేషనల్‌ స్కూలులో చదువుతున్న విద్యార్థులను చుట్టు పక్కల ఉన్న స్కూళ్ళలో చేర్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆ స్కూలుకు చేరువగా ఐదు ప్రభుత్వ పాఠశాలలు, 17 ప్రైవేటు పాఠశాలలు, రెండు కళాశాలలు ఉన్నాయని, వీటిలో ఆ విద్యార్థులకు ప్రవేశం కల్పించి విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-07-20T13:30:08+05:30 IST