తరగతి గదుల్లో Cell Phones ఉంటే స్వాధీనం

ABN , First Publish Date - 2022-06-15T13:07:28+05:30 IST

తరగతి గదుల్లో విద్యార్థుల చేతుల్లో సెల్‌ఫోన్లు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని, ఆ ఫోన్లు తిరిగి ఇచ్చే ప్రసక్తే ఉండదని రాష్ట్ర విద్యాశాఖామంత్రి

తరగతి గదుల్లో Cell Phones ఉంటే స్వాధీనం

                         - విద్యాశాఖా మంత్రి అన్బిల్‌ మహేష్‌


అడయార్‌(చెన్నై), జూన్‌ 14: తరగతి గదుల్లో విద్యార్థుల చేతుల్లో సెల్‌ఫోన్లు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని, ఆ ఫోన్లు తిరిగి ఇచ్చే ప్రసక్తే ఉండదని రాష్ట్ర విద్యాశాఖామంత్రి అన్బిల్‌ మహేష్‌ వెల్లడించారు. తిరుచ్చిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ళపాటు సరిగా చదువులు సాగలేదన్నారు. దీన్ని సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆలోచన చేసి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులను కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేసిందన్నారు. తరగతి గదుల్లోకి మొబైల్‌ఫోన్లకు అనుమతి లేదన్నారు. ఒక వేళ ఈ నిబంధనలు అతిక్రమించి విద్యార్థుల చేతుల్లో మొబైల్‌ ఫోన్లు కనిపిస్తే మాత్రం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నీట్‌ రద్దు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలు విద్యార్థులు యూనిఫాం తమ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదన్నారు. 12 యేళ్ళకు పైబడిన విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్లు వేశామన్నారు. అవసరమైతే వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు టీసీ కావాలంటూ డిమాండ్‌ చేయకూడదన్నారు. టీసీ లేకపోయినా అడ్మిషన్‌ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ సంఖ్య మరింత పెరిగితే ఇంటి వద్దకే విద్యా పథకాన్ని రద్దు చేస్తామని మంత్రి మహేష్‌ వెల్లడించారు. 

Updated Date - 2022-06-15T13:07:28+05:30 IST