నిధులిస్తున్న అభివృద్ధిపై అలసత్వం ఎందుకు ?

ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST

పల్లెప్రగతిపై మంత్రి అజయ్‌కుమార్‌ యాక్షన్‌ షూరూ అయింది. ఇటీవల కార్యక్రమాల్లో పల్లె, పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పల్లె, పట్టణ ప్రగతిపై ఆరా తీస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నారు.

నిధులిస్తున్న అభివృద్ధిపై అలసత్వం ఎందుకు ?
మంచుకొండ వీధులను పరిశీలిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌

క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

విధులు విస్మరిస్తే అధికార పార్టీ అయినా సహించేదిలేదు

మంచుకొండలో మంత్రి అజయ్‌కుమార్‌ ఆకస్మిక పర్యటన

గ్రామంలో పారిశుధ్య నిర్వహణ తీరుపై అసంత్రుప్తి

 ప్రోటోకాల్‌ విస్మరించిన గ్రామ కార్యదర్శి సస్పెన్సన్‌  

రఘునాథపాలెం జూన్‌ 16: పల్లెప్రగతిపై మంత్రి అజయ్‌కుమార్‌ యాక్షన్‌ షూరూ అయింది. ఇటీవల కార్యక్రమాల్లో పల్లె, పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పల్లె, పట్టణ ప్రగతిపై ఆరా తీస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నారు. అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఖమ్మం జిల్లా రఘునాఽథపాలెం మండలంలోని మంచుకొండలో పర్యటించారు. గ్రామంలో వీధులన్నీ కలియతిరిగారు. అక్కడ ప్రజలతో సమస్యలపై మాట్లాడారు. గ్రామంలో ఎక్కడ చెత్త అక్కడే ఉండటం, డ్రైనేజీ వ్యవస్త అస్తవ్యస్తంగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  పల్లె ప్రగతిపై ఇంతటి అలసత్వం ఎందుకని మండిపడ్డారు. నిధులు ఇస్తున్నా అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించటంలేదని అధికారులను ప్రశ్నించారు. తాను గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో కార్యదర్శి పక్కన లేకపోవటంతో మంత్రి అజయ్‌ మరింత ఆగ్రహానికి లోనయ్యారు. 

కార్యదర్శి సస్పెన్షన్‌ 

మంచుకొండ పర్యటిస్తున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు గ్రామంలో అనేక సమస్యలు కంటపడటంతో సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి ఎక్కడ అని పిలవటంతో సదరు కార్యదర్శి అక్కడ లేకపోవడంతో మరింత ఆగ్రహం చెందారు. గతంలోనూ మంత్రి పర్యటన సందర్భంగా సదరు కార్యదర్శి గౌర్హాజరైన సంధర్బాలు ఉన్నాయి. దాంతో ఫ్రోటోకాల్‌ పాటించటంలో విఫలం చెందటమే కాకుండా గ్రామాభివృద్ధిని పట్టించుకోకపోవటంతో కార్యదర్శి రాంకీనీ సస్పెండ్‌ చేయాలని డీపీవో ప్రభాకర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో డీపీవోపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు తరువాత కార్యదర్శి రాంకీని సస్పెండ్‌ చేశారు. 

ప్రతిపల్లెలో పర్యటిస్తా.. అధికార పార్టీ అయినా సహించేదిలేదు 

పల్లెప్రగతిపై పరిశీలను ప్రతి గ్రామంలో పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోని ప్రాంతాల్లోనే ఇలా ఉంటే మిగితా గ్రామాలు ఎలా ఉన్నాయని జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అభివృద్ధిలో అలసత్వం వహిస్తే అధికార పార్టీ సర్పంచ్‌లను సైతం ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే జిల్లాను ఆధర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంతో కోట్లాడి నిధులు తెచ్చిపెడుతున్నాని, అయినా అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డీపీవో ప్రభాకర్‌రావు, ఎంపీడీవో అశోక్‌కుమార్‌, ఎంపీపీ గౌరి, జడ్పీటిసి ప్రియాంక, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, మందడపు సుధాకర్‌, మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్‌రావు, మాధవరావు, సర్పంచ్‌ విజయ, ఉపసర్పంచ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST