మైనింగ్‌ రాయల్టీ పెంపు

ABN , First Publish Date - 2022-05-23T06:13:33+05:30 IST

మైనింగ్‌ రాయల్టీ పెంపు

మైనింగ్‌ రాయల్టీ పెంపు


  • అమల్లోకి పెంచిన పన్ను విధానం
  • జిల్లాలో యేటా రూ.80కోట్ల నుంచి రూ.100 కోట్ల రాయల్టీ లక్ష్యం

తాండూరు, మే, 22 : రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంలో భాగంగా ఖనిజాలపై భారీ ఎత్తున రాయల్టీని పెంచింది. ప్రతి మూడేళ్ల కోసారి రాయల్టీ పెంచాల్సి ఉండగా, ఈసారి మాత్రం ఆరేళ్ల తర్వాత రాయల్టీని పెంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 ఖనిజాలపై రాయల్టీని పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వికారాబాద్‌ జిల్లాలో ముఖ్యంగా నాపరాయి, సుద్ధ, ఎర్రమట్టి, కంకర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో సున్నపురాయి టన్నుకు రూ.100రాయల్టీ ఉండగా, ప్రస్తుతం రూ.130కి పెంచారు. సుద్ధ టన్నుకు రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.195కు పెంచారు. ఎర్రమట్టి టన్నుకు రూ.100 ఉండగా, ప్రస్తుతం రూ.130కి పెంచారు. కంకర రూ.50 నుంచి రూ.65కి పెంచారు. పెంచిన రాయల్టీని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లాలో నాపరాయి గనులు 80, సుద్ధ గనులు 36, ఎర్రమట్టి గనులు 70, కంకర గనులు 30 వరకు ఉన్నాయి. ప్రతి ఏటా ఖనిజ సంపదపై రూ.80కోట్ల మేరకు ఆదాయం వస్తుంది. రాయల్టీ పెరగడంతో పాటు ఉత్పత్తులు పెరిగితే ఆదాయం రూ.100 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. తాండూరులో ఉన్న మూడు సిమెంటు కర్మాగారాల ద్వారా రూ.30 కోట్ల మేరకు ఆదాయం వస్తుంది. అయితే సిమెంటు ఉత్పత్తికి వాడే లైమ్‌ స్టోన్‌ టన్నుకు రూ.80 ఉంది. అయితే లైమ్‌స్టోన్‌కు సంబంధించి రాయల్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున దాని రాయల్టీని పెంచలేదు. జిల్లా నుంచి ఎర్రమట్టి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రాకు తరలనుండగా, నాపరాయి కర్ణాటక, ఆంధ్రా, తమిళనాడు, మహారాష్ట్రకు వెళుతుంటాయి. ఈప్రాంత సుద్ధ మాత్రం విదేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో ఖనిజాలపై రాయల్టీలో భారీ తేడాలు ఉండటంతో తాండూరుకు సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రం మిర్యాణం వైపు నాపరాయి వ్యాపారులు తమ వ్యాపారం విస్తరించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తాండూరుకు చెందిన నాపరాయి వ్యాపారులు నాపరాయిపై రాయల్టీ తగ్గించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని  మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి  కలిసి ద్వారా విన్నవించారు. 

Updated Date - 2022-05-23T06:13:33+05:30 IST