క్వారీ.. పోరు

ABN , First Publish Date - 2022-08-19T05:56:18+05:30 IST

అక్రమ మైనింగ్‌తో వచ్చే ఆదాయాన్ని గడిచేందుకు గురజాల నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

క్వారీ.. పోరు
నారాయణపురంలో ఆందోళన చేస్తున్న వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ల రేవతి

వైసీపీ నేతల బాహాబాహీ

క్వారీ ప్రారంభించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కాసు అనుచరుడు

అడ్డుకున్న వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ల రేవతి

పరస్పర దాడులు.. దూషణలు

అగ్ర కులాలవారికే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని రేవతి ఆరోపణ

తమకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయన్న రమేష్‌రెడ్డి

రణరంగంగా మారిన నారాయణపురం మైనింగ్‌క్వారీ  

దాచేపల్లి, ఆగస్టు 18: అక్రమ మైనింగ్‌తో వచ్చే ఆదాయాన్ని గడిచేందుకు గురజాల నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నారాయణపురంలోని మైనింగ్‌ క్వారీ వివాదం మరోసారి రాజుకుంది. వైసీపీ నేతల పరస్పర దాడులు, బూతు పురాణాలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. గురువారం రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన మందపాటి రమేష్‌రెడ్డిలు నువ్వెంతంటే నువ్వెంతంటూ తలపడ్డారు. ఇరువర్గాలు దాడికి, ప్రతిదాడికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి సర్ది చెప్పారు. ఘర్షణపడుతున్న ఇద్దరూ వైసీపీ నేతలే కావటంతోవారిని సముదాయించటం పోలీసుల సహనానికి పరీక్షగా మారింది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి పల్నాడు జిల్లా దాచేపల్లి నగరపంచాయతీ నారాయణపురంలోని 17/3లో 2.93ఎకరాల క్వారీభూమిలో మైనింగ్‌ చేసుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అందులో భూమిపూజ చేసేందుకు రమేష్‌రెడ్డి గురువారం పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ల రేవతి, భర్త రఘు, మరికొంతమంది అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. క్వారీ భూములు వడ్డెరులకే సొంతమని, మా తాతముత్తాతలు, వడ్డెరజాతి రాయిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, ఇతరులకు మైనింగ్‌ క్వారీతో పనేమిటని రేవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో క్వారీ పనులు చేపడుతున్నానని మందపాటి రమేష్‌రెడ్డి వివరించగా చైర్మన్‌ రేవతి పూజలో ఉన్న పటాలను తొలగించి వేసింది. దీంతో ఆగ్రహం చెందిన మందపాటి రమేష్‌రెడ్డి, అతని అనుచరులు రేవతి, ఆమె అనుచరులపై పరస్పర దాడికి తలపడ్డారు. ఈ దాడిలో రేవతి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఆడపిల్ల అని చూడకుండా, ఐదునెలల బాలింతనని కూడా కనికరించకుండా తనపై దాడికి పాల్పడ్డారని, బలహీనవర్గాలకు, మహిళలకు గౌరవం, రక్షణ లేదని, తనకు న్యాయం చేయాలని రేవతి క్వారీలో నేలపై కూర్చొని రోదించింది. దాచేపల్లి సీఐ బిలాలుద్దీన్‌, ఎస్‌ఐ రహంతుల్లా, శివనాగరాజు, ఇతర సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకొని రేవతి, రమేష్‌రెడ్డి వర్గీయులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రమేష్‌రెడ్డి, రేవతి వర్గీయులు పరస్పరం దాడికి పాల్పడటం, చేతులతో నెట్టుకోవటం, బూతులు తిట్టుకోవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు తక్షణమే స్పందించి  ఇరువర్గాలను పక్కకు నెట్టివేసి అక్కడినుంచి స్టేషన్‌కు తరలించారు. తనకు న్యాయం జరగటం లేదని ఆరోపిస్తూ రేవతి అనుచరులతో కలిసి రాష్ట్ర రహదారిపై గంటకుపైగా రాస్తారోకో చేసింది. అక్కడే కూర్చుని ఫిర్యాదు పత్రం రాశారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ బిలాలుద్దీన్‌ తెలిపారు.

  

రమేష్‌రెడ్డి నుంచి నాకు ప్రాణహాని - కార్పొరేషన్‌ చైర్మన్‌ రేవతి

 ఎమ్మెల్యే  కాసుమహేష్‌రెడ్డి అనుచరుడైన మందపాటి రమేష్‌రెడ్డి అతని అనుచరుడు భయ్యన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని దేవళ్ల రేవతి తెలిపారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వడ్డెరలను యజమానులు చేస్తామని భరోసా ఇచ్చారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. వడ్డెరులను కాదని, రమేష్‌రెడ్డికి ప్రభుత్వం లీజు ఎలా ఇచ్చిందని ఆమె ప్రశ్నించారు. బాలింతనైన తనపై దాడిచేశారని ఆమె రోదించింది. సంవత్సరం నుంచి నన్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏడాది క్రితం నీలకంఠబాబును చంపారు. మరో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈరోజు నన్ను చంపటానికి కుట్రపన్నారు. పోలీసులు ఆగ్రకులానికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. 


 నాపై దాడి చేసి బెదిరిస్తున్నారు..  రమేష్‌రెడ్డి 

 నారాయణపురంలోని క్వారీలో మైనింగ్‌ చేసేందుకు అనుమతి పొందామని మందపాటి రమేష్‌రెడ్డి తెలిపారు. పూజ చేసుకుంటున్న తమ వద్దకు వచ్చిన రేవతి దేవుని పటాలు నెట్టివేసిందన్నారు.  పక్కనే ఉన్న టెంకాయ తీసుకొని తనపై విసిరివేసిందన్నారు. ఇదేమంటే ఆడమనిషిని, బలహీన వర్గాలకు చెందిన మనిషిని, నాపై చేయి చేసుకుంటారా అంటూ బెదిరింపులకు పాల్పడుతూ నానా యాగి చేసిందని రమేష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతితో మైనింగ్‌ క్వారీ చేసుకోవటం తప్ప ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. తనపై దాడి చేయటంతో చిరిగిపోయిన చొక్కాను, ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతి పత్రాలను ఆయన చూపారు. 


Updated Date - 2022-08-19T05:56:18+05:30 IST