కేంద్రం ‘ధర’ దించేశారు!

ABN , First Publish Date - 2020-10-02T08:18:41+05:30 IST

‘‘సీజన్‌కు ముందుగానే మద్దతు ధర ప్రకటిద్దాం. ఆ మద్దతు ధరే కొనుగోళ్లకు బెంచ్‌మార్క్‌ కావాలి’’ అంటూ రాష్ట్ర ప్రభు త్వం చేసిన ప్రకటనలోని తీవ్రత ‘మద్దతు’లో లేకపోవడం రైతాంగాన్ని మండిస్తోంది...

కేంద్రం ‘ధర’ దించేశారు!

  • పైసా కూడా తేడా లేని మద్దతు ధర

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘సీజన్‌కు ముందుగానే మద్దతు ధర ప్రకటిద్దాం. ఆ మద్దతు ధరే కొనుగోళ్లకు బెంచ్‌మార్క్‌ కావాలి’’ అంటూ రాష్ట్ర ప్రభు త్వం చేసిన ప్రకటనలోని తీవ్రత ‘మద్దతు’లో లేకపోవడం రైతాంగాన్ని మండిస్తోంది. కేంద్రం ప్రకటించిన ధరలకు రూపాయి తేడా లేకుండా అవే ధరలు ప్రకటించడంపై పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ లో రైతులు పండించే పంట ఉత్పత్తులకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించింది. 15రకాల పంటలకు కేంద్రం ధరలను ‘డిటో’ దింపేసింది.


2020 ఖరీఫ్‌ సీజన్‌ పంట ఉత్పత్తులకు కేంద్రం చాలా రోజులక్రితమే మద్దతు ధరలు నిర్ణయించింది. 2020-21 రబీ పంటలకు కూడా ఇటీవల ఎమ్మెస్పీ ప్రకటించింది. ఒకటీ అరా తప్పించి, అన్ని పంటలకు దాదాపు అవే ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది. కేంద్రం జాబితాలో మిర్చి, పసుపు, అరటి, బత్తాయి, ఉల్లి తదితర పంటలు లేవు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది, ఈ ఏడాదీ ఎమ్మెస్పీ ప్రకటించిం ది. నాణ్యమైన మిర్చి ప్రస్తుతం రూ.12వేలుపైగా పలుకుతోంది. తక్కువ రకాలు రూ.7వేలుదాకా ఉన్నాయి. కానీ ప్రభుత్వం రూ.7వేలే మద్దతు ధర ప్రకటించింది. బాల్‌ కొబ్బరి ధర రాష్ట్రప్రభుత్వం రూ.10,500గా నిర్ణయించగా, ఇప్పటికే కోనసీమ మార్కెట్‌లో క్వింటా రూ. 12వేలుపైగా పలుకుతోంది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఉల్లిపాయలు ప్రస్తుతం క్వింటా రూ.3 వేలుపైగా పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం రూ.770 మద్దతు ధర నిర్ణయించింది. పత్తి, మిర్చి,పొగాకు, పసుపు వంటి పంటలకు ఎగుమతి ఆర్డర్లు ఉంటే కేంద్రం చెప్పే మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఆర్డర్లు లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, అంతర్జాయ మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడం, పంట నాణ్యత లేకపోవడం, నిల్వ సదుపాయాలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో వ్యాపారులు చౌకకు అడగడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రాదు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్‌లోకి దిగడం, జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు మద్దతు ధర లభించే అవకాశముంటుంది. అయితే కేంద్రం ప్రకటించిన ధరలకే నిరుడు చాలా పంట అమ్ముడుపోక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయిస్‌ సంస్థల ద్వారా ధాన్యం, అపరాలు, మొక్కజొన్న, పొగాకు కొనుగోలు చేసింది. పొగాకు తప్ప, ఇతర పంటలకు ప్రభుత్వ జోక్యంతో లాభపడిన పరిస్థితులు లేవని రైతునేతలు చెబుతున్నారు. మార్కెట్‌లో ధరలు పెరిగే సమయంలో కంటే, సీజన్‌ మొత్తం మద్దతు ధరకు కొనుగోళ్లు జరిగితేనే రైతులకు లాభమని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల పోస్టర్‌ను సీఎం జగన్‌ గురువారం ఆవిష్కరించారు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతుల్లో ఉండకుండా అవసరమైతే పంట ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు రూ.3,300కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ‘‘మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలంటే రైతులు ఈ-కర్షక్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత ఆర్‌బీకేలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల ద్వారా పంట ఉత్పత్తిని రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్బీకేల్లో ఎమ్మెస్పీకి  కొనుగోలు చేస్తాం’’ సీఎం స్పష్టం చేశారు. 


Updated Date - 2020-10-02T08:18:41+05:30 IST