Abn logo
Oct 19 2021 @ 00:17AM

చట్టబద్ధ హక్కుగా కనీస మద్దతు ధర

మూడుదశాబ్దాల క్రితం సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాయి. వాటి పర్యవసానంగా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఆహార స్వయంసమృద్ధి పెరిగింది. ఎగుమతులు కూడా గణనీయ స్థాయికి చేరాయి. అయినప్పటికీ భారతీయ వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. అనేకానేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయరంగంలో పెనుమార్పులను లక్ష్యించి కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌లో మూడు ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. మూడు నెలలు తిరగక ముందే వాటికి పార్లమెంటు ఆమోదం సాధించింది. ఆ కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులోకంలో, ముఖ్యంగా  ఉత్తర భారతావనిలో ఎడతెగని ఆందోళన జరుగుతోంది. 


విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని ‘జాతీయ రైతు కమిషన్’ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50శాతాన్ని అదనంగా కలిపి కనీస మద్దతు ధరను రైతుల చట్టబద్ధ హక్కుగా ప్రకటించాలని గత పదినెలలుగా ఆ సేతు హిమాచలం లక్షలాది రైతులు ఆందోళన చేస్తున్నారు. కేరళలో వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో 50 శాతం సూత్రాన్ని ఇప్పటికే అమలుచేస్తుండడం హర్షణీయం. 


ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతాన్ని కలిపిన కనీస మద్దతు ధరను చట్టబద్ధ హక్కుగా పొందేందుకు వీలుగా ఒక బిల్లును రూపొందించింది. ఇది ఒక శుభ పరిణామం. 


పశ్చిమబెంగాల్‌ జనాభాలో నూటికి 60 శాతం మందికి పైగా ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వివిధ సందర్భాలలో రైతులకు ఉత్పత్తి వ్యయం కూడా లభించకపోవడం వల్ల, సాఫీగా జీవించేందుకు వారి హక్కునకు భంగం కలగటం వంటి అంశాల కారణంగా ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్వయంప్రతిపత్తి హోదాలో రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం, గిట్టుబాటు ధరల గ్యారంటీ కమిషన్‌ను ఏర్పాటు చేయబోతోంది. వ్యవసాయ ఆర్థిక అంశాలలో క్షుణ్ణంగా అవగాహన కలిగిన రైతు అధ్యక్షతన ఏర్పాటు అయ్యే ఈ కమిషన్‌లో మహిళా, రైతు సంఘాలు, వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ చక్కని అవగాహన ఉన్న ఐదుగురు రైతులు నాన్‌ అఫీషియల్‌ సభ్యులుగా ఉంటారు. వ్యవసాయ ఆర్థిక రంగంలో 15 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యవసాయ నిపుణులు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయ, ఉద్యాన, పశుగణాభివృద్ధి, మత్స్య రంగానికి చెందిన నలుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. డెప్యూటీ సెక్రటరీ స్థాయికి చెందిన వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారి పూర్తికాలం మెంబర్‌ సెక్రటరీగా ఉంటారు. కమిషన్‌ కాలవ్యవధి 5 సంవత్సరాలు. ఈ కమిషన్‌ సిఫారసు చేసిన ఎంఎస్‌పిని రాష్ట్ర ప్రభుత్వం విధిగా ప్రకటిస్తుంది.  


అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులలోను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంట అమ్మకాలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరలకు కొనకూడదు. ఆ మేరకు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవడం కూడా చట్టవిరుద్ధమే. ఒక వేళ అలా జరిగిన పక్షంలో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, వ్యాపారస్థుడు, కమీషన్‌ ఏజెంట్‌ కొన్న ధరకు మధ్య వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రైతుకు చెల్లించవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో స్వయం సహాయక బృందాలు, ఎఫ్‌పిఓలు, రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార భద్రత కోసం అమలు చేసే పథకాలకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, కూరగాయలు, పాలు, కోడిగుడ్లు మున్నగువాటి ధరలు పడిపోయినపుడు రెండు రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ‘మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్’ను అమలు చేస్తుంది. రైతులు పంట వచ్చిన వెంటనే ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు గోడౌన్‌లలో సరుకు నిల్వ చేసుకొని, 75 శాతం విలువను అడ్వాన్స్‌గా పొందే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన ధరలు అమలయ్యేలా చూసేందుకు వివిధ స్థాయిలలో అధికారులను బాధ్యులుగా చేస్తుంది. కౌలురైతులు, మహిళా రైతులు, ఆదివాసీ రైతులతో సహా యావన్మందిని గుర్తించి ఈ పథకం ప్రయోజనాలు వారందరికీ దక్కేలా సర్కార్‌ కృషి చేస్తుంది.


ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇచ్చే విషయంలో వ్యాపారస్తులెవరైనా తప్పుగా వ్యవహరిస్తే మొదటి పర్యాయం రైతుకు జరిగిన నష్టానికి రెండు రెట్లు జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండో పర్యాయం తప్పు చేస్తే రైతుకు చేకూరిన నష్టానికి రెండు రెట్ల అపరాధ రుసుంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది. మూడవ పర్యాయం కూడా తప్పుచేస్తే మూడు రెట్ల అపరాధ రుసుంతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించడమేకాక వ్యాపార లైసెన్స్‌ రద్దవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైనా, ఉద్దేశ్యపూర్వకంగా ఈ స్కీమ్‌ అమలుపరచటంలో వైఫల్యం చెందితే ఒక నెలజీతం తగ్గించడంతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులోని సెక్షన్‌ 22 పేర్కొంది. ఈ స్కీమ్ ప్రకారం రైతుకు కనీస మద్దతు ధర లభించనప్పుడు అతనికి చేకూరిన నష్టాన్ని ‘రాష్ట్ర నష్ట పరిహార ఫండ్‌’ నుంచి పొందే వెసులుబాటు కల్పించారు. 


మన దేశంలో ఒక రాష్ట్రప్రభుత్వం కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ ఆ హక్కుకు చట్టబద్ధత కల్పించడానికి పూనుకోవడం అభినందనీయం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ నీటిమూటే అయిందని మరి చెప్పనవసరం లేదు. ఒక కుటుంబం కనీస అవసరాలు తీరాలంటే నెలకు కనీసం రూ.18,000 ఆదాయం ఉండాలని ఏడవ వేతన సంఘం నిర్ధారించింది. అందువల్లే కేంద్రప్రభుత్వం కొత్త ఉద్యోగుల నెలసరి జీతం రూ.21,000లుగా నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం మనదేశంలో సగటు వ్యవసాయ కుటుంబం నెలసరి ఆదాయం రూ.8,960 మాత్రమే. గత 35 సంవత్సరాల వ్యవధిలో వ్యసాయ ఉత్పత్తుల ధరలు 22 రెట్లు పెరుగగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతభత్యాలు దాదాపు 90 నుంచి 120 రెట్లు పెరిగాయి. ఇనుము, సిమెంట్‌, టేకు, కలప వంటి వస్తువులతో పాటు సేవారంగంలో కూడా పలు సేవల ధరలు దాదాపు 70 నుంచి 100 రెట్లు పెరిగాయన్నది ఎవరూ కాదనలేని ఒక వాస్తవం. అందువల్లే డాక్టర్ ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి చట్టబద్ధమైన ఎంఎస్‌పి ధరలను ప్రకటించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 


ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత లేకపోవడం వల్ల అత్యధిక శాతం రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. ఇది ప్రభుత్వమే అంగీకరిస్తున్న సత్యం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ రూపొందించిన నమూనా బిల్లును కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కౌలు రైతులు, వ్యాపారులు, ప్రజాసంఘాలు, వినియోగదారుల సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు మున్నగు యావన్మందితో చర్చించాలి. ఆ చర్చల ప్రాతిపదికన ఆ బిల్లుకు తుదిరూపు నిచ్చి అమలుపరిచినప్పుడే వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆస్కారముంటుంది. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమిస్తూ, కరువులు, తుఫాన్లు, అధిక వర్షాల వల్ల కలిగే నష్టాలను తట్టుకుంటూ, సరిపడా పంటరుణాలు లభించక, సరైన పంటల బీమా పథకం లేక నష్టపోతూ గొర్రెతోక బెత్తెడు చందంగా ఉన్న సామాన్య రైతుల జీవితాలలో మార్పు రావడానికి వీలు కలుగుతుంది. 

వడ్డే శోభనాద్రీశ్వరరావు

మాజీ మంత్రి 

ప్రత్యేకం మరిన్ని...