Abn logo
May 23 2020 @ 04:17AM

ఆందోళన ‘బాట’!

పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు

ఆవేదన చెందుతున్న వలస కూలీలు

‘మడ్డువలస’ నుంచి కొంతమంది స్వగ్రామాలకు పయనం

మార్గమధ్యలో అడ్డుకున్న యంత్రాంగం


(వంగర)

స్థానికంగా ఉపాధి లేక.. పొట్ట కూటి కోసం సుదూర ప్రాంతానికి వలస పోయాం. కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ చిక్కుకున్నాం. చేతికి పని లేక.. కడుపు నిండా తిండి లేక.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం మమ్మల్ని స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడంతో ఎంతో సంబరపడ్డాం. పునరావాస కేంద్రాలకు తరలించినా.. ఫర్వాలేదు సొంత జిల్లా కదా.. ఎలాగో ఒకలా తలదాచుకుంటామని ఆనందపడ్డాం. కానీ, ఇక్కడి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇన్నాళ్లూ అవస్థలు పడిన మాకు.. పునరావాస కేంద్రంలో  ఇబ్బందులు తప్పడం లేదు.  కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు.


ఇదీ వలస కూలీల ఆవేదన. 

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు.. వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యపు తీరుపై వలస కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం.. వంగర మండలం మడ్డువలస పునరావాస కేంద్రంలో అలజడి రేగింది. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ.. కొంతమంది తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాలినడకన కొంత దూరం వెళ్లగా.. అధికారులు మార్గమధ్యలో వారిని అడ్డుకున్నారు. వారిని ఒప్పించి.. మళ్లీ ప్రత్యేక వాహనంలో పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే జలుమూరు మండలంలోని యలమంచిలి పునరావాస కేంద్రంలోనూ వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు.


కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. వంగర మండలం మడ్డువలస గురుకుల పాఠశాలలో పునరావాస కేంద్రానికి గురువారం రాత్రి మూడు ప్రత్యేక వ్యానుల్లో కొందరు, శుక్రవారం ఉదయం ఒక ప్రైవేటు బస్సుతో పాటు రెండు ఆర్టీసీ బస్సుల్లో 230 మంది వలస కార్మికులు హైదరాబాద్‌ నుంచి వచ్చారు. వీరంతా ఇచ్ఛాపురం, సోంపేట, నందిగాం తదితర మండలాలకు చెందినవారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వీరిని అధికారులు నేరుగా ఈ పునరావాస కేంద్రానికి తరలించారు. కానీ, తమను ఎవరూ ఇక్కడ పట్టించుకోవడం లేదంటూ కొంతమంది కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాగునీటి సౌకర్యం లేదని, కనీసం భోజనాలు కూడా పెట్టలేదని.. ఈ కేంద్రంలో  14 రోజులు పిల్లాపాపలతో ఎలా ఉండగలమని అధికారుల తీరును ప్రశ్నించారు. ఇక్కడ తాము ఉండలేమంటూ కొంతమంది స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మడ్డువలస నుంచి రేగిడి మండలం సరిహద్దు రెండో మైలు వరకూ నడక సాగించారు. ఎండ తీవ్రత కారణంగా మార్గమధ్యలో చెట్ల వద్ద కాసేపు నిరీక్షించారు. ఈ విషయం ప్రత్యేకాధికారి మన్మథరావుకు తెలియడంతో.. వెంటనే ఆయన కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఎస్‌ఐ అహ్మద్‌ కూడా అక్కడకు చేరుకుని కార్మికులను ఒప్పించి.. పునరావాస కేంద్రానికి తరలించారు.

  

గ్రామస్థులు హడల్‌ 

హైదరాబాద్‌ నుంచి వచ్చిన వలస కార్మికులు పునరావాస కేంద్రంలో ఉండకుండా కాలినడకన వెళ్లిపోతుండడంతో గ్రామస్థులు భయాందోళన చెందారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి అధికారులు ఆరోగ్య పరీక్షలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వారు బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ, వారు స్వగ్రామాలకు వెళ్లిపోతున్నా.. పట్టించుకోకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పునరావాస కేంద్రంలో అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందని మండిపడుతున్నారు. 


వ్యక్తిగత సదుపాయాల కోసమే.. మన్మథరావు, ప్రత్యేకాధికారి, వంగర 

పునరావాస కేంద్రం నుంచి కొందరు  వలస కూలీలు కొంతదూరం వెళ్లిపోయిన మాట వాస్తవమే. వారిని పోలీసుల సహకారంతో మార్గమధ్యలో అడ్డుకుని.. వెనక్కి రప్పించాం. వలస కూలీలు వ్యక్తిగత సదుపాయాలు కావాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు కల్పించాలని కోరారు. వసతి కూడా విశ్రాంతి భవనాన్ని తలపించేలా ఉండాలని డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నాం. 


‘యలమంచిలి’లో నిరసనలు

జలుమూరు: పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడమే తాము చేసిన పాపమని వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు యలమంచిలి పునరావాస కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ శుక్రవారం నిరసన తెలిపారు. సంతబొమ్మాళి, గార మండలాలకు చెందిన 34 మంది వలస కూలీలను గురువారం సాయంత్రం జలుమూరు మండలం యలమంచిలి పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. ఇందులో 21 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 21 మంది పురుషులను ఒకే గదిలో ఉంచడంపై వారు ఆందోళన చెందుతున్నారు. కనీసం గదులు శుభ్రంగా లేవని, భోజనం కూడా అంతంతమాత్రమే పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


శుక్రవారం ఉదయం టిఫిన్‌ కూడా పెట్టలేదని వాపోయారు. దుప్పట్లు కూడా ఇవ్వకపోవడంతో నేలపైనే నిద్రించామని తెలిపారు. రెండు మరుగుదొడ్లు ఉండడంతో.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం నీటిసౌకర్యం కూడా లేక స్నానాలకు అనేక అవస్థలు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. దీనిపై తహసీల్దారు బి.రామారావును వివరణ కోరగా కొత్తగా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినందున పూర్తి సౌకర్యాలు కల్పించలేకపోయామన్నారు. రెండు మూడు రోజుల్లో దుప్పట్లు పంపిణీతో పాటు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement