పంటపొలాల్లో చీడపీడల నివారణకు సాధారణంగా పవర్ స్ర్పేయర్‌తో గంటకు ఎకరం వరకు క్రిమిసంహారక మందును పిచికారీ చేయవచ్చు. దీనికి అధిక వ్యయంతో పాటు ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఇలా కాకుండా తక్కువ సమయం, తక్కువ వ్యయంతో ఎక్కువ ఎకరాలపై పిచికారీ చేసే మార్గాన్ని కనిపెట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి గ్రామ రైతు జోసెఫ్. ఆయన 25 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. క్రిమిసంహారక మందుల పిచికారీకి పవర్ స్ర్పేయర్ల బదులుగా.. మినీ ట్రాక్టర్ కంప్రెషర్ సాయంతో పిచికారీ చేశారు. ట్రాక్టర్ వెనుక స్టాండ్ బిగించి దానికి ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్మును అమర్చారు. ట్రాక్టర్ ఇంజన్‌ను కంప్రెషర్‌కు అనుసంధానం చేశారు. వెనుక కూర్చున్న వ్యక్తి కంప్రెషర్‌కు అమర్చిన పంపు పట్టుకుని పిచికారీ చేస్తున్నాడు. మినీ ట్రాక్టర్ కంప్రెషర్‌తో గంటకు 10 ఎకరాల వరకు పిచికారీ చేయగలుగుతున్నామని జోసెఫ్ తెలిపారు.
- ఆంధ్రజ్యోతి, యాదాద్రి