ఆదరణ కరువు!

ABN , First Publish Date - 2022-06-02T04:14:42+05:30 IST

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైంది. అరకొర నిధులతో

ఆదరణ కరువు!
నిరుపయోగంగా ఉన్న శంకర్‌పల్లి మినీస్టేడియం

  • సంవత్సరాలుగా నిరుపయోగంగా మినీ స్టేడియాలు
  • పట్టించుకోని అధికారులు, పాలకులు 
  • ఉపయోగంలోకి తీసుకురావాలంటున్న క్రీడాకారులు


గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైంది. అరకొర నిధులతో అసంపూర్తిగా నిర్మాణమైన స్టేడియాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. క్రీడా మైదానాలు లేక విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి రావడం లేదు. రానురాను క్రీడాసక్తి సన్నగిల్లుతోంది. ఎప్పుడో ఒకసారి నిర్వహించే టోర్నమెంట్ల సమయంలో మాట్లాడే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ తర్వాత వాటి ఊసే ఎత్తని పరిస్థితి నెలకొంది.


చేవెళ్ల, జూన్‌ 1 : పాలకుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మినీ స్టేడియాలు ఆదరణకు నోచుకోవడం లేదు. చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో మినీస్టేడియాలు నిర్మించి దాదాపు 12సంవత్సరాలైనా ఉపయోగంలోకి తీసుకురాకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. నిరుపయోగంగా ఉన్న మినీస్టేడియాలను ఉపయోగంలోకి తీసుకువస్తే గ్రామీణ క్రీడాకారులకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ఉన్నవాటిని పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందుకోసం అధికారులతో ఆయా గ్రామాల్లో స్థలాల ఎంపిక చేయిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే కొత్తగా క్రీడాస్థలాల ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా గతంలో నిర్మించిన వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని క్రీడాకారుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ పాలనలో మంత్రి సబితారెడ్డి చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో మినీస్టేడియాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించి నిర్మించేందుకు కృషి చేశారు. అయితే ఆ నిధులు సరిపోకపోవడంతో కాంట్రాక్టర్లు మీనిస్టేడియాల అసంపూర్తిగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. కాగా స్టేడియాల లోపల క్రీడాకారులకు సౌకర్యవంతంగా గ్రౌండ్‌ ఏర్పాటు చేయకపోవడంతో అందులో ఎలాంటి ఆటలు ఆడటానికి వీలులేకుండా పోయింది. అరకొర వసతులతో నిర్మించిన స్టేడియాలను సంవత్సరాలు గడుస్తున్నా వాటిని ఇప్పటివరకూ ప్రారంభించలేదు. మినీస్టేడియాలు ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఈ స్టేడియాలు తాగుబోతులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి మినీస్టేడియాల్లో మిగిలిపోయిన పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని క్రీడాకారులు కోరుతున్నారు. 


మినీస్టేడియాల్లో పిచ్చిమొక్కలు

అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో చేవెళ్ల, శంకరపల్లి మండల కేంద్రాల్లో ఉన్న మినీస్టేడియాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. స్టేడియాల నిర్వహణ కరువై వాటి రూపురేఖలే మారిపోయాయి. క్రీడాకారులు వాటిల్లోకి అడుగు పెట్టే వీలులేకుండా పోయింది. మైదానాలు అందుబాటులో లేక క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్నారు. ఆటలు ఆడేందుకు వ్యవసాయ క్షేత్రాలు, ఖాళీ ప్లాట్లను ఆశ్రయిస్తున్నారు.


ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం కరువు

చేవెళ్ల నియోజకవర్గంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నా ప్రోత్సాహం లేదు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, టెన్నిస్‌, రన్నిగ్‌ తదితర క్రీడల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వరకు పాల్గొనేవారు పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రతిఏటా జిల్లాలో జరిగే వివిధ పోటీల్లో పాల్గొనడానికి ఈ ప్రాంతం నుంచి అనేకమంది క్రీడాకారులు వెళ్తుంటారు. మైదానాలు అందుబాటులోకి తీసుకొస్తే మరికొంతమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.


మినీస్టేడియం అందుబాటులోకి తేవాలి

నేను వాలీబాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాను. మాలాంటి పేద క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్టేడియాన్ని బాగుచేస్తే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతంలోని చాలామంది క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా మైదానాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి క్రీడాకారులను ప్రోత్సహించాలి. చేవెళ్లలో మినీస్టేడియం సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండటం ప్రభుత్వానికి క్రీడల పట్ల చిన్నచూపు ఉందనడానికి నిదర్శనం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.

- అనిల్‌కుమార్‌, వాలీబాల్‌ రాష్ట్రస్థాయి క్రీడాకారుడు, చేవెళ్ల


 మినీస్టేడియాలు బాగు చేయాలి

మండలంలో అర్ధంతరంగా నిలిచిపోయిన పనులను పూర్తిచేసి మినీస్టేడియంను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. కొత్తగా గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు ఎంపిక చేయడం మంచిదే అయినా.. మినీ స్టేడియాలను కూడా బాగుచేయాలి. లేకపోతే ప్రజాధనం వృథాగా పోతుంది. క్రీడల్లో చాలామంది విద్యార్థులు రాణిస్తున్నారు. క్రీడాకారులకు స్టేడియం అందుబాటులోకి తీసుకొస్తే మరికొందరు ఆటల్లో ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి క్రీడలకు పెద్దపీట వేయాలి.

 - శ్యామెల్‌, వాలీబాల్‌ క్రీడాకారుడు, దామరిగిద్ద


చదువుతోపాటు క్రీడలూ ముఖ్యం 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే. ఎంతోమంది స్పోర్ట్స్‌ కోటాలో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. నేటితరం విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆటలతో శారీరక మానసికోల్లాసం పెరుగుతుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరిగేలా కృషి చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మీనిస్టేడియాలు పూర్తి చేసి క్రీడకారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. 

- అక్బర్‌, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు

Updated Date - 2022-06-02T04:14:42+05:30 IST