అటకెక్కిన.. మినీ గోకులం

ABN , First Publish Date - 2022-01-21T05:06:14+05:30 IST

పాడి పరిశ్రమ అభివృద్ధి.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన మినీ గోకులం పథకం అట కెక్కింది.

అటకెక్కిన.. మినీ గోకులం
పాలకొల్లులో మినీ గోకులం షెడ్‌

పాలకొల్లు, జనవరి 20 : పాడి పరిశ్రమ అభివృద్ధి.. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన మినీ గోకులం పథకం  అట కెక్కింది. ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి అందాల్సిన సొమ్ములు మూడేళ్లగా మంజూరులేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధి లోని పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో గోకులం పథకం కింద 108 మంది రైతులను పశుసంవర్థకశాఖ ఎంపిక చేసింది.ఈ పథకం కింద పశువుల సంర క్షణకు షెడ్ల నిర్మాణం చేపట్టాలి. అందుకు రెండు గేదెలకు సంబంధించిన షెడ్డును రూ. లక్ష, నాలుగు గేదెలకు రూ. 1.50 లక్షలు, ఆరు గేదెలకు రూ. 1.80 లక్షలతో నిర్మాణం జరుపుకోవాలి.రూ.20 వేలు రైతు భరించాలి. మిగిలిన సొమ్ము ప్రభు త్వాల నుంచి మంజూరవుతాయి. దీంతో ఈ పథకానికి ఎంపికైన రైతుల్లో 70 మంది ముందుకొచ్చి షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు. మిగిలిన 38 మంది అసం పూర్తిగా వదిలేశారు. పూర్తయిన షెడ్లకు మూడేళ్లు గడుస్తున్నా సొమ్ములు మం జూరుకు నోచుకోలేదు. అప్పులు చేసి షెడ్ల నిర్మాణం జరుపుకున్నామని.. మూడే ళ్లగా సొమ్ములందక ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నామని పాడి రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని సొమ్ములు అందించాలని కోరుతున్నారు.


నిబంధనలు పాటించలేదు : రామశేఖర్‌, ఏడీఏ, పాలకొల్లు  


మినీ గోకులం పథకం షెడ్ల నిర్మాణాల్లో కొందరు రైతులు నిబంధనల మేరకు కొలతలు పాటించలేదు. దీని వల్ల సొమ్ముల మంజూరుకు ఆడిట్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్లీ షెడ్ల నిర్మాణ కొలతలపై సర్వే చేస్తున్నాం. దీనికి సంబం ధించి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. నిధు లు రాగానే రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.


Updated Date - 2022-01-21T05:06:14+05:30 IST