విమ్స్‌లో మినీ కాల్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-12T05:13:34+05:30 IST

విమ్స్‌లో మినీ కాల్‌ సెంటర్‌ను ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మంగళవారం ప్రారంభించారు

విమ్స్‌లో మినీ కాల్‌ సెంటర్‌
విమ్స్‌లో కాల్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న విమ్స్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు

అందుబాటులోకి టెలీ కన్సల్టేషన్‌ సేవలు

విశాఖపట్నం, మే 11(ఆంధ్రజ్యోతి): విమ్స్‌లో మినీ కాల్‌ సెంటర్‌ను ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మంగళవారం ప్రారంభించారు. విమ్స్‌లో వైరస్‌ బాధితులు చేరగానే వారు ఏ వార్డులో, ఏ పడక మీద ఉన్నారో సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు మెసేజ్‌ రూపంలో ఇక్కడి నుంచి పంపిస్తారు. అలాగే, వైరస్‌ బాధిత కుటుంబ సభ్యులు కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి వారి వివరాలను తెలుసుకోవచ్చని డాక్టర్‌ రాంబాబు తెలిపారు. మూడు షిప్టుల్లో సిబ్బంది పని చేస్తారని, ఒక్కో షిప్టులో 20 మంది సిబ్బంది ఉంటారని వివరించారు. ఒక టీమ్‌కు మూడు వార్డులు అప్పగించామని, ఆ వార్డులోని వైరస్‌ బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. అలాగే, టెలీ కన్సల్టేషన్‌ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసీయూలో క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్న రోగులను 24 గంటలు సీనియర్‌ వైద్యులు వీడియో ద్వారా పర్యవేక్షిస్తూ, రోగికి సకాలంలో వైద్య సేవలను అందిస్తారన్నారు. ఇది రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. అదేవిధంగా రోగి సహాయకులకు ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతిరోజూ 300 మందికి ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్లు, విమ్స్‌ సిబ్బంది కోసం టీ, కాఫీ సదుపాయాన్ని కల్పించామని ఆయన వెల్లడించారు. విమ్స్‌ సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహాయ, సహకారాలను అందించాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ సత్యప్రసాద్‌, డాక్టర్‌ భవానీ రావు, డాక్టర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-12T05:13:34+05:30 IST