దిగుబడులను దిగమింగిన ఘనులు

ABN , First Publish Date - 2022-06-08T06:39:22+05:30 IST

మార్కెట్‌లో మోసాలు జరుగుతాయి. ధర తక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వానికి అమ్మితే.. అధికారులు స్వయంగా కొంటారు.

దిగుబడులను దిగమింగిన ఘనులు
యల్లనూరు పోలీస్‌ స్టేషనకు వెళ్లిన రైతులు (ఫైల్‌)

రైతులకు టోకరా

మార్క్‌ఫెడ్‌కి పప్పుశనగ, మొక్కజొన్న

రైతుల నుంచి సేకరించిన సహకార సంఘం

రూ.10 లక్షలకు పైగా ఎగవేసి.. మాయం

స్పందించని పోలీసులు, జిల్లా అధికారులు


మార్కెట్‌లో మోసాలు జరుగుతాయి. ధర తక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వానికి అమ్మితే.. అధికారులు స్వయంగా కొంటారు. పైగా గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇలా అనుకుని పలువురు రైతులు ఆరుగాలం శ్రమించిన పంట దిగుబడులను విక్రయించారు. రైతుల నుంచి దిగుబడులను మార్క్‌ఫెడ్‌ సేకరించి.. నాఫెడ్‌కు అప్పగిస్తే.. ఆ సంస్థ ద్వారా రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. మార్క్‌ఫెడ్‌ అధికారులు దిగుబడుల సేకరణ బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ ఓ సహకార సంఘానికి అప్పగించింది. దీని ప్రతినిధి.. దిగుబడులను దిగమింగాడు. రైతులు నిలువునా మోసపోయారు. అధికారుల వద్దకు వెళ్లి గోడు వెల్లబోసుకున్నారు. పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏడాది గడిచినా.. రైతులకు న్యాయం జరగలేదు. ఇది రైతు ప్రభుత్వంలో రైతుల పట్ల యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు! ధాన్యాన్ని దిగమింగిన వారు దర్జాగా తిరుగుతుంటే.. బాధిత రైతులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనంగా ఎందుకున్నారు..? ఆ పాపంలో భాగం పంచుకున్నారా..? ఇట్లాంటివి ‘రైతు ప్రభుత్వం’లో మామూలే అనుకున్నారా..?


యల్లనూరు : మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో గత ఏడాది పప్పుశనగ, మొక్కజొన్న కొనుగోలు చేశా రు. వీటిని సేకరించే బాధ్యతను మార్క్‌ఫెడ్‌ అధికారులు ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ శ్రీచైతన్య వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్‌కి ఆ పనిని అప్పగించింది. ఈ సంఘం ప్రతినిధులు, యల్లనూరు మండలం వెన్నపూసపల్లిలో సుమారు 30 మంది రైతుల నుంచి 15 ట్రక్కుల పప్పుశనగను సేకరించారు. వీటికి సంబంధించిన డబ్బు కొందరు రైతుల ఖాతాలో జమ అయింది. కానీ సుమారు 20 మంది రైతుల ఖాతాలో సొమ్ము జమకాలేదు. దీంతో 10 నుంచి 15 రోజులపాటు ఎదురుచూసిన బాధిత రైతులు, గత ఏడాది జూన, జూలై మాసాల్లో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించారు. విషయం తమకు తెలియదని, మార్క్‌ఫెడ్‌ అధికారులను సంప్రదించాలని వారు రైతులకు సూచించారు. రైతులు జిల్లా కేంద్రంలోని మార్క్‌ఫెడ్‌ అధికారుల వద్దకు వెళ్లగా, తమ గోడౌనలోకి వచ్చిన ధాన్యానికి డబ్బులు జమచేశామని, మిగిలిన వాటి విషయం తమకు తెలియదని తేలిపోయారు. దీంతో కొందరు రైతులు అక్కడున్న అధికారులను గట్టిగా నిలదీశారు. తమ నుంచి సేకరించిన దిగుబడులు ఏమయ్యాయో చెప్పాలని పట్టుబట్టారు. దీంతో దిగుబడులను సేకరించిన సంఘం పేరును అధికారులు రైతులకు తెలియజేశారు.


అక్కడ మొదలైంది..

మార్క్‌ఫెడ్‌ అధికారులను రైతులు కలిసిన విషయం తెలియగానే, శ్రీచైతన్య వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్‌ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. తాను రైతుల నుంచి సేకరించిన పప్పుశనగల్లో డ్యామేజీ ఎక్కువగా ఉండడంతో నాఫెడ్‌ అధికారులు తిరస్కరించారని, వాటిని తన గోదాములో భద్రపరిచానని మార్క్‌ఫెడ్‌ అధికారులకు సంస్థ ప్రతినిధి  సోమశేఖర్‌ తెలియజేశాడు. వారం పది రోజులు గడువు ఇస్తే.. దిగుబడులను అమ్మి, రైతులకు సొమ్ము చెల్లిస్తానని లిఖితపూర్వకంగా గత ఏడాది జూలై 5న హామీ పత్రం రాసిచ్చాడు. వెన్నపూసపల్లి గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతుల ఖాతాల్లో రెండు నెలల తర్వాత కొంత సొమ్ము జమచేశాడు. ఆ తరువాత  ఐదుగురు పప్పుశనగ రైతులకు రూ.2 లక్షలకు పైగా ఎగవేశాడు. దీంతో బాధిత రైతులు జిల్లా అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లి గోడు వెల్లబోసుకున్నారు. పోలీసులు అప్పుడప్పుడు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని పిలిపించడం, ఆయన గడువు కోరితే వదిలేయడం పరిపాటిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సంఘం ప్రతినిధి పోలీసులకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


మొక్కజొన్నలనూ కాజేశారు

పప్పుశనగ రైతులతో పాటు మొక్కజొన్న రైతులు కూడా ఆ సంస్థ చేతిలో మోసపోయారు.  రైతుల నుంచి సేకరించిన దిగుబడులను మార్క్‌ఫెడ్‌కు చేరవేయకుండా.. బయట అమ్ముకున్నట్లు సమాచారం. వాసాపురం, చింతకాయమం ద, బుక్కాపురం, తిమ్మంపల్లి గ్రామాలకు చెందిన సుమారు పది మంది రైతులకు మొక్కజొన్న దిగుబడులకు సంబంధించి రూ.8 లక్షలకు పైగా డబ్బులు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ ఏడాది నుంచి రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు.








అధికారులు పట్టించుకోవడం లేదు..

రెండు సంవత్సరాల క్రితం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో యల్లనూరు సహకార సంఘానికి  పప్పుశనగలను అమ్మాను. అప్పట్లో రెండు నెలల తరువాత నా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యా యి. అదే నమ్మకంతో గత ఏడాది దిగుబడులను అమ్మాను. మొత్తం రూ.88 వేలకు గానూ 52 వేలు బ్యాంకు ఖాతాలో వేశారు. మిగిలిన రూ.36 వేలు ఇప్పటికీ ఇవ్వలేదు.  ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇలాంటి మోసాలు జరగడం ఏమిటి..? ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులను, జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం లేదు. స్వచ్ఛంద సంస్థ వారితో మాట్లాడతామని చెబుతున్నారే గాని, డబ్బులు ఇప్పించడం లేదు.

- రామాంజులరెడ్డి, వెన్నపూసపల్లి


ఏడాదిగా ఎదురుచూస్తున్నా..

మార్కెట్‌ రేటు కన్నా క్వింటానికి రూ.200 అదనంగా వస్తుందన్న ఆశతో రూ.80 వేల విలువైన మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్‌కు ఇచ్చాను. మా నుంచి దిగుబడులు సేకరించిన స్వచ్ఛంద సంస్థ నుంచి రూ.60 వేలు మాత్రమే వచ్చింది. అదికూడా అధికారులకు ఫిర్యాదు చేశాక కొంత కొంత వచ్చింది. ఇంకా రూ.20 వేలు రావాల్సి ఉంది. ఏడాది నుంచి ఎదురుచూస్తున్నా. మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలి.

- సుదర్శన రెడ్డి, వాసాపురం


పోలీసులు వదిలేశారు..

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రికార్డుల పరంగా మార్క్‌ఫెడ్‌ తరపున డబ్బులు చెల్లించాం. మరికొంతమంది రైతులు ఎటువంటి ఆధారాలు లేకుండా మా ప్రతినిధి సోమశేఖర్‌కు ధాన్యాన్ని ఎత్తించారు. ఆ విషయం మాకు మూడునెలల తర్వాత మార్క్‌ఫెడ్‌ అధికారుల ద్వారా తెలిసింది. దీంతో మా సంస్థ ప్రతినిధి సోమశేఖర్‌ను పిలిపించి యల్లనూరు పోలీ్‌సస్టేషనకు తీసుకువెళ్లాం. డబ్బు చెల్లించేందుకు అతను కొంత సమయం అడగటంతో పోలీసులు వదిలేశారు. గడువు తీరినా అతను చెల్లించలేదు. 

  -తులసీబాయి, సంఘంసీఈఓ 


Updated Date - 2022-06-08T06:39:22+05:30 IST