అట్టపెట్టెలో నీళ్లు

ABN , First Publish Date - 2021-06-19T07:59:24+05:30 IST

వాటర్‌క్యాన్లు, వాటర్‌ బాటిళ్లు.. మంచినీటి కరువున్న రాజధాని మహానగరవాసుల్లో చాలా మంది నిత్యజీవితంలో భాగం! కానీ, ఆ క్యాన్లను, బాటిళ్లను ప్లాస్టిక్‌తో తయారుచేస్తారు.

అట్టపెట్టెలో నీళ్లు

  • దేశంలోనే తొలిసారి పేపర్‌బాక్స్‌లో మినరల్‌ వాటర్‌
  • హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ కుర్రోళ్ల వినూత్న ప్రయత్నం


(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి): వాటర్‌క్యాన్లు, వాటర్‌ బాటిళ్లు.. మంచినీటి కరువున్న రాజధాని మహానగరవాసుల్లో చాలా మంది నిత్యజీవితంలో భాగం! కానీ, ఆ క్యాన్లను, బాటిళ్లను ప్లాస్టిక్‌తో తయారుచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వాటర్‌ బాటిళ్లలో 10ు మాత్రమే రీసైకిల్‌ అవుతున్నాయి. మిగతా 90ు భూమిలోకి లేదా సముద్రంలోకి చేరుతున్నాయని అంచనా. వాటివల్ల పర్యావరణానికి ఎంతో హాని. అందుకే.. ఆ సమస్యకు చెక్‌ పెట్టేలా దేశంలోనే తొలిసారి పేపర్‌ బాక్స్‌లో మినరల్‌ వాటర్‌ను అందించాలనే ఓ వినూత్న ఐడియాతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ కుర్రాళ్లు ముందుకొచ్చారు. వారే చైతన్య, సునీత్‌ తాతినేని. కారో అనే యాప్‌ సాయంతో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి, పలు గేటెడ్‌ కమ్యూనిటీలకు యాప్‌ ఆధారిత సేవలను అందిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేటప్పుడు, ఇంట్లోనూ తాము ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో బ్రాండెడ్‌ వాటర్‌ను మాత్రమే తాగేవాళ్లమని వారు వివరించారు. 


క్రమంగా ఇంట్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగిపోతుండడంతో తమ ఆలోచనలో మార్పు వచ్చిందని వెల్లడించారు. అప్పుడే తమకు పేపర్‌బ్యాగ్స్‌లో మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చినట్టు తెలిపారు. ‘‘ఆ తర్వాత రెండేళ్లపాటు దీనిపై అధ్యయనం చేశాం. ఎంతోమంది అభిప్రాయాలు తీసుకుని పర్యావరణహితంగా కారో పేపర్‌ బాక్స్‌ వాటర్‌ను విడుదల చేశాం. వీటి తయారీలో పూర్తిగా పేపరే వాడామా అంటే.. కాదుగానీ, సాధారణంగా ఒక లీటర్‌ బాటిల్‌ తయారుచేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్‌లో 15ు కన్నా తక్కువ ప్లాస్టిక్‌ను మాత్రమే 20 లీటర్ల బాక్స్‌ తయారీకి వాడాం. వీటిని పూర్తిగా రీసైకిల్‌ చేయొచ్చు. పొరపాటున ల్యాండ్‌ఫిల్‌కు వెళ్లినా (అంటే ఎవరైనా వీధిలో పారేసినా) త్వరగానే భూమిలో కలిసిపోతుంది’’ అని కారో ఫౌండర్లలో ఒకరైన సునీత్‌ తెలిపారు. కారో పేపర్‌ వాటర్‌ బాటిల్స్‌ను 5, 10, 20 లీటర్‌ కార్టన్స్‌లో అందిస్తున్నారు. వాటి ధరలు వరుసగా.. రూ.75, రూ.100, రూ.120. 


అదే టెక్నాలజీ..

పర్యావరణ అనుకూల కార్టన్‌ బాక్సులను (దీనినే కొరుగేటెడ్‌ బాక్స్‌గా వ్యవహరిస్తారు) ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ఇంజిన్‌ ఆయిల్స్‌,  జ్యూస్‌ల ప్యాకింగ్‌కు వినియోగిస్తున్నాయి. అదే సాంకేతికతను ఈ వాటర్‌ బాక్స్‌లలో కూడా వినియోగించారు. భారతదేశంలో మంచి నీటి కోసం ఈ తరహా బాక్స్‌ను రూపొందించిన తొలి సంస్థ తమదే అంటున్నారు సునీత్‌. కేవలం పర్యావరణాన్నేగాక.. వినియోగదారుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు.. ఒక రోజులో మనిషికి అవసరమైన రాగిలో 20 శాతాన్ని ఈ నీటిలో జోడించామంటున్నారు వీరు. రాగి చెంబులో నీళ్లు రాత్రంతా ఉంచుకుని ఉదయమే తాగే అవకాశం లేని వారికి ఇది ప్రత్యామ్నాయమని వారు చెబుతున్నారు. అలాగే.. ఆయుర్వేద ప్రయోజనం కూడా అందించే రీతిలో ‘యష్టిమధు(లైకోరైస్)’ను సైతం దీంట్లో జోడించామంటున్నారు. గొంతు నొప్పిని తగ్గించడంలో ఇది తోడ్పడుడుతందట.


యాప్‌తో డెలివరీ.. ప్రయోజనమూ..

కారో పేపర్‌ వాటర్‌ బాటిల్స్‌ను 5, 10, 20 లీటర్‌ కార్టన్స్‌లో అందిస్తున్నారు. వాటి ధరలు వరుసగా.. రూ.75, రూ.100, రూ.120. ప్రతి కార్టన్‌కూ ప్రత్యేకంగా ట్యాప్‌ ఉండటం వల్ల నీరు వ్యర్థం కాదు. ప్రస్తుతానికి నగరంలో కొన్ని సూపర్‌మార్కెట్‌లలో 5 లీటర్ల కార్టన్స్‌ దొరుకుతున్నప్పటికీ.. కారో వాటర్‌ యాప్‌ ద్వారా హోమ్‌ డెలివరీ ని చందా రూపంలో అందిస్తున్నారు. కార్టన్‌ను తిరిగి అందజేస్తే రివార్డ్‌ పాయింట్లనూ అందజేస్తున్నామని, అనవసరంగా ల్యాండ్‌ఫిల్స్‌కు  చేర్చకుండా రీసైకిల్‌ చేయడమే ఈ పాయింట్ల వెనుక ప్రధానోద్దేశమని చెబుతున్నారు సునీత్‌. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే సేవలనందిస్తున్న వీరు.. త్వరలోనే బెంగళూరు, వైజాగ్‌లకు తమ సేవలను విస్తరించనున్నారు. రాబోయే 3-4 సంవత్సరాలలో నూరుకోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నామని వారు చెబుతున్నారు.

Updated Date - 2021-06-19T07:59:24+05:30 IST