బలహీనతకు ప్రధాన కారణం విటమిన్ల లోపమా? అసలు నిజమేంటంటే..

ABN , First Publish Date - 2022-02-08T19:25:33+05:30 IST

వ్యాధినిరోధకశక్తి విలువేంటో కరోనాతో తెలిసొచ్చింది. దాంతో బలవర్థకమైన ఆహారానికి పెద్ద పీట వేస్తున్నాం. అయినప్పటికీ ఇతరత్రా పోషకాల కోసం సప్లిమెంట్ల మీద కూడా ఆధారపడుతున్నాం. అయితే సూక్ష్మపోషకాలు, ఖనిజ లవణాలను వాటి నిజరూపాల్లో పొందడం కోసం, ప్రత్యామ్నాయ మందుల మీద ఆధారపడవచ్చు అంటున్నారు హోమియో నిపుణులు.

బలహీనతకు ప్రధాన కారణం విటమిన్ల లోపమా? అసలు నిజమేంటంటే..

ఆంధ్రజ్యోతి(08-02-2022)

వ్యాధినిరోధకశక్తి విలువేంటో కరోనాతో తెలిసొచ్చింది. దాంతో బలవర్థకమైన ఆహారానికి పెద్ద పీట వేస్తున్నాం. అయినప్పటికీ ఇతరత్రా పోషకాల కోసం సప్లిమెంట్ల మీద కూడా ఆధారపడుతున్నాం. అయితే సూక్ష్మపోషకాలు, ఖనిజ లవణాలను వాటి నిజరూపాల్లో పొందడం కోసం, ప్రత్యామ్నాయ మందుల మీద ఆధారపడవచ్చు అంటున్నారు హోమియో నిపుణులు. 


ముక్కు నుంచి నీరు కారడం, చర్మం, ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీలు కలిగి ఉండేవాళ్లలో వ్యాధినిరోధకశక్తి తక్కువ. ఈ కోవకు చెందిన వ్యక్తులు వాతావరణ మార్పులకు తేలికగా ప్రభావితం అవుతూ ఉంటారు. చలి కాలంలో చలినీ, ఎండాకాలంలో వేడినీ వీళ్లు తట్టుకోలేరు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే కొందర్లో తరచూ జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. క్షయ వ్యాధికి మూల కారణం కూడా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండడమే! అయితే ఇలా వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండే వ్యక్తులు ఇమ్యూనిటీని పెంచే కొన్ని హోమియో మందులను వాడుకోవచ్చు. అందులో ప్రధానమైనది ‘సోరినమ్‌’. రక్తహీనత వల్ల కూడా రోగనిరోధకశక్తి తగ్గుతుంది. కాబట్టి రక్తహీనతను తగ్గించే హోమియో వైద్యంతో సమస్యను పరిష్కరించవచ్చు. క్షయ వ్యాధి కారక బ్యాక్టీరియాతో తయారయ్యే ‘ట్యూబర్క్యులినం’ కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. 


ఖనిజ లవణాల ప్రాధాన్యం

బలహీనతకు ప్రధాన కారణం విటమిన్ల లోపం అనుకుంటాం. కానీ వాటి కంటే కీలకమైన పోషకాలు ఖనిజ లవణాలు. వీటి లోపం వల్ల కూడా ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. మట్టిలో 18 రకాల ఖనిజ లవణాలుంటాయి. వీటన్నిటినీ ఆహారం ద్వారా సంగ్రహించగలిగే ఒకే ఒక మార్గం సజ్జలను ఆహారంలో చేర్చుకోవడం. అయితే సజ్జలను ఆహారంగా తీసుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయింది. అయినప్పటికీ వాటిలోని పోషకాల విలువను తెలియజెప్పడం కోసం తొమ్మిది రోజుల సద్దుల పండగ (బతుకమ్మ పండుగ)ను జరుపుకునే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నాం.


సజ్జ రొట్టెను దంచి, బెల్లం చేర్చి తయారుచేసే ‘మలిద ముద్దలు’ పిల్లలకు తినిపించడానికి వెనకున్న కారణం ఇదే! మొహర్రం నాడు కూడా మలిద ముద్దలను తినే సంప్రదాయం ఉంది. మరీ ముఖ్యంగా బతుకమ్మ పండగ జరపుకునే తొమ్మిది రోజులూ కౌమారంలో అడుగుపెట్టే ఆడపిల్లలకు మలిద ముద్దలను తినిపించడం వెనక ఓ కారణం ఉంది. సజ్జలతో తయారుచేసే ఈ వంటకం ద్వారా, వాళ్లలో విలువైన 18 ఖనిజ లవణాల లోటు ఏర్పడకుండా చేయడం కోసమే ఈ సంప్రదాయం ఆచరణలోకి వచ్చింది. అయితే విలువైన పోషకాలుండే సజ్జలను కేవలం పండుగ రోజులకే పరిమితం చేయకుండా నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అందుకోసం సజ్జలతో సంగటి చేసుకోవచ్చు. రొట్టె రూపంలో తినవచ్చు. ఈ పిండికి, గోధుమ పిండిని చేర్చి, చపాతీలు చేసుకోవచ్చు. అలాగే బూరెలు, గంజి కూడా వండుకోవచ్చు.  


సింథటిక్‌ మందులతో ప్రయోజనం తక్కువ

ఇమ్యూటినీని పెంచుకోవడం కోసం మల్టీ విటమిన్‌ సప్లిమెంట్ల మీద ఆఽధారపడుతూ ఉంటాం. అయితే అవన్నీ ప్రయోగశాలల్లో తయారయ్యే సింథటిక్‌ మందులు. ఇవి సహజసిద్ధమైనవి కావు కాబట్టి, కాలేయం వీటిని శోషించుకోలేదు. కాలేయం ప్రమేయం లేకుండా మందుల సారం ఒంటబట్టే వీలే ఉండదు. దాంతో ఈ మందులన్నీ మలమూత్రాలు, స్వేదం ద్వారా విసర్జించబడుతూ ఉంటాయి. అయితే విదేశాల్లో మినహా, మన దేశంలో ఇలాంటి సహజసిద్ధ సప్లిమెంట్లను తయారుచేసే ఫార్మసీలు లేవు. సేంద్రీయ వ్యవసాయం తగ్గిపోయింది కాబట్టి, ఇలాంటి పోషకాలను సహజసిద్ధ రూపాల్లో సంగ్రహించే పరిస్థితి కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇలా మందుల రూపంలో వాటిని భర్తీ చేసుకోవచ్చు. అయితే అలాంటి సహజసిద్ధ సప్లిమెంట్లు హోమియోలో ఉన్నాయి. 


వేసవిలో పోషక లోపాల భర్తీ

వేసవిలో అడుగు పెడుతున్నాం. ఈ కాలంలో సోడియం లోపం తలెత్తుతుంది. ఎండ వేడిమికి, స్వేదాన్ని ఎక్కువగా కోల్పోతాం. కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి సరిపడా నీళ్లు తాగం. కొందర్లో సహజంగానే దాహం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది దాహం వేసినా, దప్పిక తీర్చుకోవడం వాయిదా వేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మహిళలు నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు. రోజుకు రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లతో సరిపెట్టుకునే వాళ్లూ ఉంటారు. ఇలా సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. వేసవిలో స్వేదం రూపంలో శరీరం నుంచి సోడియం బయటకు వెళ్లిపోతుంది కాబట్టి, ఆ లవణాన్ని భర్తీ చేస్తూ ఉండాలి. ఉప్పు పట్ల సర్వత్రా కొన్ని అబద్ధపు ప్రచారాలు నెలకొని ఉన్నాయి. ఉప్పుతో రక్తపోటు పెరుగుతుందనేది అపోహ. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ఉప్పుతో రక్తపోటు పెరగదు. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కచ్చితంగా ఆహారంలో ఉప్పును తగ్గించవలసిందే! అయితే ప్రతి ఒక్కరూ కెమికల్‌ సాల్ట్‌ (టేబుల్‌ సాల్ట్‌)కు బదులుగా రాతి ఉప్పును తీసుకోవడం ఆరోగ్యకరం. చక్కెరలా ఉప్పును నచ్చినంతా తినలేం. దానికీ పరిమితి ఉంటుంది. కాబట్టి ఉప్పు గురించి అనవసర భయాలకు లోను కావలసిన అవసరం లేదు. 


ఎలక్ట్రోలైట్ల లోపం లేకుండా...

సోడియం, పొటాషియం, క్లోరైడ్‌ ఈ మూడూ సరిపడా ఉంటేనే శరీర జీవక్రియలన్నీ సమర్థంగా నడుచుకుంటాయి. సోడియం, క్లోరైడ్‌లతో పోలిస్తే, ఆహారంతో పొటాషియం దక్కే అవకాశాలు చాలా తక్కువ. ఫలితంగా మనలో ఎక్కువ మందిలో పొటాషియం లోపం ఉంటూ ఉంటోంది. ఈ లోపాన్ని భర్తీ చేయడం కోసం పొటాషియం సమృద్ధిగా దొరికే అరటిపండు తినవచ్చు. కానీ చవకైన, పొటాషియంతో నిండిన ఏకైక పండు, అరటిపండును అలక్ష్యం చేస్తున్నాం. 


హోమియో మందులతో...

మనం ఎంతటి బలవర్థకమైన, పోషకభరితమైన ఆహారం తిన్నప్పటికీ జీవప్రక్రియ (మెటబాలిజం) మెరుగ్గా లేకపోతే, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోలేదు. కాబట్టి మెటబాలిజంను సరిదిద్ది, తద్వారా పోషకాల శోషణను పెంచుకోవాలి. ఇందుకోసం హోమియోలోని ‘సైలీషియా’ తోడ్పడుతుంది. ఇది అతి మెత్తని ఇసుకలో, సమృద్ధిగా ఉండే సిలికాన్‌తో తయారవుతుంది. ఈ మందుతో కాలేయం, పేగులను ప్రేరేపించి, జీర్ణశక్తిని ప్రకోపింపజేయడం ద్వారా పోషకాల వృథాను అరికట్టి, శోషణ పెరిగేలా చేయవచ్చు. తద్వారా మెటబాలిజంను పెంచుకోవచ్చు.


వడదెబ్బ నుంచి రక్షణగా...

‘నేట్రం కార్బ్‌’ ఒక డోసు వేసుకుని బయటకు వెళ్తే ఎండదెబ్బ తగిలే వీలుండదు. హోమియో మందుల ప్రభావం శరీరంలో మూడు రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ఈ మందును అవసరం అయినప్పుడే వాడుకోవచ్చు.


కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్ల కోసం...

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా దీర్ఘకాలం పాటు బలహీనత కొనసాగుతోంది. ఇలాంటి వాళ్లు ‘యాసిడ్‌ ఫాస్ఫారిక్‌’ను తీసుకోవచ్చు. నీరసం, అలసటలు ఈ మందుతో అదుపులోకొస్తాయి. 


ద్వాదశ లవణ చికిత్స

12 రకాల కణజాల లవణాలను అందించడం ద్వారా శరీరంలో పోషక లోపాన్ని అరికట్టవచ్చు. సోడియం, క్యాల్షియం, పొటాషియం, క్లోరైడ్‌... ఇలా శరీర జీవప్రక్రియకు అవసరమయ్యే లవణాలన్నిటినీ అందించి పోషకలోపాలను నివారించుకోవచ్చు. శరీర జీవక్రియలన్నిటినీ ఈ చికిత్సతో గాడిలో పడేలా చేయవచ్చు. పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఒక ప్రధాన కారణం రక్తంలో ఆక్సిజన్‌ తగ్గుదల. మరీ ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గడం మూలంగా కొన్ని రకాల మానసిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యను సరిదిద్దడంలో క్యాలిఫాస్‌ ఔషధం తోడ్పడుతుంది. ఈ మందు రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణాన్ని పెంచుతుంది. అలాగే ద్వాదశ లవణ చికిత్సలో భాగంగా నేట్రంమూర్‌ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సోడియం లోపాన్ని భర్తీ చేస్తుంది. ఈ లవణం లోపం ఉన్నవాళ్లు రోజుకు మూడుసార్లు నేట్రంమూర్‌ తీసుకోవచ్చు. అలాగే సోడియం ఫాస్ఫేట్‌, సోడియం సల్ఫైడ్‌ లోపం ఉన్నవాళ్ల కోసం నేట్రంఫాస్‌, సోడియంసల్ఫ్‌లను తీసుకోవచ్చు. శరీరంలో మందకొడిగా సాగుతున్న జీవప్రక్రియలన్నింటినీ ఈ మందులు క్రమబద్ధం చేస్తాయి. ద్వాదశ లవణ చికిత్సలో ఇలాంటి లవణాలను సప్లిమెంట్ల రూపంలో శరీరానికి అందించడం ద్వారా పోషక లోపాలను అరికట్టడం జరుగుతుంది. ఈ మందుల ప్రభావం ఎక్కువ, ఖర్చు తక్కువ. పూర్వం కేవలం ఈ ఒక్క చికిత్సతోనే ప్రధాన చికిత్స మొత్తం కొనసాగేది. దీన్ని బట్టి లవణాల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.



డాక్టర్‌ అంబటి సురేంద్ర రాజు 

హోమియో వైద్య నిపుణులు,

క్యూర్‌ హోమియో క్లినిక్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-02-08T19:25:33+05:30 IST