చిట్టీల పేరుతో చీటింగ్‌..!

ABN , First Publish Date - 2022-04-15T17:51:18+05:30 IST

కొందరు కూలీ, నాలీ చేసుకుని.. మరికొందరు రేయింబవళ్లు కష్టపడి పైసాపైసా కూడబెడతారు. అవసరానికి పనికివస్తాయని

చిట్టీల పేరుతో చీటింగ్‌..!

నమ్మితే.. నట్టేట ముంచుతున్నారు 

రూ. కోట్లతో బిచాణా ఎత్తేస్తున్న కొందరు   

లక్షలాది మంది బాధితులు   

నిత్యం వెలుగు చూస్తున్న ఘటనలు


హైదరాబాద్‌ సిటీ: కొందరు కూలీ, నాలీ చేసుకుని.. మరికొందరు రేయింబవళ్లు కష్టపడి పైసాపైసా కూడబెడతారు. అవసరానికి పనికివస్తాయని చిట్టీలు వేస్తారు. ఇలా చిట్టీలు వేసిన వారి డబ్బు భారీ మొత్తంలో జమ అయిన వెంటనే కొందరు చిట్టీల వ్యాపారులు బిచాణా ఎత్తేస్తున్నారు. బాధితులు పోలీసుల చుట్టూ తిరిగినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతుంది. సీసీఎ్‌సలో ఫిర్యాదు చేసినా డబ్బులు దక్కలేదని గతేడాది ఓ బస్తీకి చెందిన బాధితులు ఏకంగా విలేకరుల సమావేశం పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 


ఎన్నో కేసులు

పాతనగరంలోని ఉప్పుగూడకు చెందిన రిటైర్ట్‌ ఏఎస్సై మచెల్మె తులసీదాస్‌ (60) కుమారుడు కార్తీక్‌కుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి 30 ఏళ్లుగా ఓం గణేశ్‌ పేరుతో చిట్టీల వ్యాపారం చేశాడు. 80 మంది బాధితులకు సంబంధించిన రూ. 4 కోట్లు తీసుకుని పరారవగా, రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. 

 వనస్థలిపురం పీఎస్‌ పరిధిలోని అనురాధ కాలనీకి చెందిన కోన విజయలక్ష్మి కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమె వద్ద కొందరు చిట్టీలు వేయగా, మరికొందరు అధిక వడ్డీక ఆశపడి డబ్బులు ఇచ్చారు. మొత్తం రూ. 12 కోట్ల వరకు ఆమె వద్ద డబ్బు ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ఆమె అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. 

 ఒంగోలు జిల్లా చీరాలకు చెందిన అంజలీదేవి, బాబురావు దంపతులు 30 ఏళ్ల నుంచి చాంద్రాయణగుట్టలో నివాసముంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరి వద్ద 200 మందికి పైగా చిట్టీ వేశారు. బాధితుల నుంచి దంపతులు సుమారు రూ. 15 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. బాధితులు సీసీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. 

 కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌ రెడ్డి, షణ్ముఖి దంపతులు, స్నేహితుడు వెంకట రమణారావుతో 15 ఏళ్ల క్రితం కేకేఆర్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో బాధితుల నుంచి రూ. 10 కోట్లకు పైగా తీసుకుని పరారయ్యారు. 

 గతంలో చిట్టీల పేరిట వెయ్యి మందికి పైగా ఖాతాదారులను ముంచి రూ. వందల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి పరారైన శైలేష్‌ గుజ్జర్‌ గురించి తెలియంది కాదు. అతను అరెస్టు అయినా లక్షలాది మంది కష్టార్జితం మాత్రం ఆవిరైంది. 

 రిషభ్‌ చిట్‌ఫండ్‌ నిర్వాహకుడు చిట్టీలు, డిపాజిట్ల పేరుతో రూ.80 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడని 11 మంది బాధితులు తొలుత మహంకాళి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్రమేణా పెరిగిన బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. అప్పట్లో ఈ కేసును సీసీఎ్‌సకు అప్పగించారు. 

 జోగన్నగారి సత్యనారాయణ రెడ్డి అబిడ్స్‌లోని జనరల్‌ పోస్టాఫీ్‌సలో పోస్టల్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. చిట్టీల వ్యాపారంతో పాటు అధిక వడ్డీలు ఇప్పిస్తానని తోటి ఉద్యోగులు 50 మందిని నమ్మించి రూ. 80 లక్షలు కాజేసి 2014 సెప్టెంబర్‌లో పరారయ్యాడు. కాగా ఐదేళ్ల తర్వాత అరెస్టు అయ్యాడు. 

 చిట్టీల పేరిట రూ. 2 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ రిటైర్ట్‌ ప్రధానోపాధ్యాయురాలితో పాటు రిటైర్డ్‌ డీసీటీఓ అధికారిని గతంలో సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయురాలు లింగాల విజయమ్మ, ఎక్కుర్తి మనోహర్‌ కలిసి చిట్టీల వ్యాపారం చేశారు. స్థానికులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బును స్థిరాస్తుల కొనుగోలులో పెట్టుబడి పెట్టారు. చిట్టీల డబ్బుతో పాటు చెల్లించిన వాయిదాలు కూడా ఇవ్వడం లేదంటూ సక్కుబాయి అనే బాధితురాలితో పాటు మరో 9 మంది సీసీఎ్‌సలో ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. 

 అండోల్‌ జగదీశ్వర్‌ చిట్టీల వ్యాపారంలో లాభాలు అధికంగా ఉన్నాయని గుర్తించి వ్యాపారం ప్రారంభించాడు. అనేకమంది వద్ద రూ. 2.7 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితుల్లో ఒకరైన బండారి రామచంద్రయ్య సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్టు చేశారు. 


ప్రమాదకరం : పోలీసులు

నమ్మకంగా ఉన్నప్పటికీ... గుర్తింపులేని.. ప్రైవేటు వ్యక్తుల వద్ద చిట్టీలు వేయడం ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు. చిట్టీల పేరిట సాగుతున్న దందా గురించి ఆర్థిక సంస్థలు పట్టించుకోకపోగా... పోలీసులు కూడా వారిపై దృష్టి సారించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రతి బస్తీలో ప్రైవేటు చిట్టీ నిర్వాహకులు పుట్టుకొస్తున్నారు. పరిచయాలు.. పలుకుబడిని ఉపయోగించి చిట్టీల దందా ప్రారంభిస్తున్నారు. చేతుల్లో డబ్బులు రాగానే జల్సాలు చేయడం.. ఆస్తులు కొనుగోలు చేయడం... ఇతర నగరాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. లక్షలు.. కోట్లలో వసూలయ్యే వరకు నమ్మకంగా ఉంటూ... డిపాజిటర్లకు తిరిగి ఇచ్చే సమయంలో బిచాణా ఎత్తేస్తున్నారు. ప్రమాదకరమైన చిట్టీల ఊబి నుంచి ప్రజలు బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-04-15T17:51:18+05:30 IST